ముంబై, ఏప్రిల్ 25 : గృహ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించిన నిర్ణయానికి అనుగుణంగా ఎల్ఐసీ హౌజింగ్ ప్రైమ్ లెండింగ్ రేటు(ఎల్హెచ్పీఎల్ఆర్)ను పావు శాతం తగ్గించింది. దీంతో గృహ రుణాలపై వడ్డీరేటు 8 శాతంతో ప్రారంభంకానున్నాయి. తగ్గించిన రేట్లు ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ తాజా నిర్ణయంతో గతంలో తీసుకున్న రుణాలతోపాటు కొత్తగా తీసుకునే రుణాలకు ఈ తగ్గింపు వర్తించనున్నదని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి తెలిపారు. దీంతో గృహ రుణాలు తీసుకునేవారి పెరిగే అవకాశం ఉండగా, గృహాలకు డిమాండ్ అధికంకానున్నదన్నారు.
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గృహ రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గనుండగా, వాహన రుణాలపై వడ్డీరేటు 8.50 శాతం నుంచి 8.25 శాతానికి దిగిరానున్నది. దీంతో రుణ గ్రహీతల నెలవారి చెల్లింపులు తగ్గనున్నాయి. కెనరా బ్యాంక్ కూడావడ్డీరేటును పావు శాతం కోత పెట్టింది. దీంతో 7.90 శాతం ప్రారంభంతో గృహ రుణాలు అందిస్తున్న బ్యాంక్..8.20 శాతానికి వాహన రుణాలు మంజూరు చేస్తున్నది. మరోవైపు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్ల నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.