న్యూఢిల్లీ, మే 24: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మరో అరుధైన ఘనతను సాధించింది. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నది. ఈ ఏడాది జనవరి 20న ఈ అరుదైన ఘనతను సాధించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. విస్తృతమైన ఏజెన్సీ నెట్వర్క్ కలిగిన తమ పనితీరుకు గుర్తుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించిందని పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 20న కంపెనీకి చెందిన 4,52,839 ఏజెంట్లు ఒక్కో పాలసీ చొప్పున 5,88,107 జీవిత బీమా పాలసీలను విక్రయించారు. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలను విక్రయించడం ఇదే తొలిసారని తెలిపింది. ఎల్ఐసీ వ్యవస్థాపక దినోత్సవం రోజైన జనవరి 20న ‘మ్యాడ్ మిలియన్ డే’ను పురస్కరించుకొని ఒక్కో ఏజెంట్ కనీసం ఒక్కో పాలసీ అయిన పూర్తి చేయాలన్న కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మొహంతీ విజ్ఞప్తి మేరకు ఈ అరుదైన ఫీట్‌ను సాధించినట్లు వెల్లడించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు.