LIC | న్యూఢిల్లీ, జూన్ 14: ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే అధికారిక ప్రతిపాదనేదీ లేదని ఎల్ఐసీ శుక్రవారం స్పష్టం చేసింది. ‘ఆ రకమైన ప్రతిపాదనైతే ఇప్పటికైతే అధికారికంగా రాలేదు’ అని హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఎంట్రీపై ఎల్ఐసీ తేల్చిచెప్పింది. ప్రస్తుతం జీవిత బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను ఇవ్వరాదు. వాటిని జనరల్ ఇన్సూరెన్స్, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలే అందిస్తున్నాయి.
బీమా చట్టం 1938, ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం కూడా ఒకే సంస్థ.. లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్‌లను అమ్మరాదు. అందుకే ఆరోగ్య బీమా పాలసీలను జారీ చేసేందుకు ఎల్ఐసీకి అనుమతి లేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకే సంస్థ జీవిత, సాధారణ, ఆరోగ్య బీమాలను అమ్ముకునేలా లైసెన్స్‌లు ఇవ్వాలని, ఆ మేరకు సంబంధిత చట్టాలను సవరించాలని బీజేపీ నేత జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించింది. దీనివల్ల దేశంలో బీమా అందరికీ చేరువవుతుందని అభిప్రాయపడింది.