LIC Chairman | భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) కొత్త చైర్మన్‌గా.. ప్రస్తుత ఎండీ, తాత్కాలిక చైర్మన్ సిద్ధార్థ మోహంతి నియామకమయ్యారు. సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ పట్నాయక్.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRCAF) మెంబర్ (LIFE)గా నియమితులయ్యారు. ఎల్ఐసీ చైర్మన్‌గా సిద్ధార్థ మోహంతి, ఐఆర్డీఏఐ బోర్డు సభ్యుడు (లైఫ్)గా బీసీ పట్నాయక్‌లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్ల నియామక సంస్థ.. ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో (FSIB) గత నెలలో సిద్ధార్థ మహంతి పేరును ఎల్ఐసీ చైర్మన్‌గా సిఫారసు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసులను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలుపగా.. నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సిద్ధార్థ మహంతి 62 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అంటే.. 2025 జూన్ ఏడో తేదీ వరకు కొనసాగనున్నారు.
గత నెల 13న ఎల్ఐసీ చైర్మన్‌గా పదవీ కాలం ముగిసిన ఎంఆర్ కుమార్ స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా ఆయనను కేంద్రం నియమించింది. ఎల్ఐసీ చైర్మన్ పదవి వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (స్టాఫ్) రెగ్యులేషన్స్-1960కి 2021లో కేంద్రం సవరణ చేసింది. ఐఆర్డీఏఐ బోర్డు సభ్యుడు (లైఫ్)గా నియమితులైన బీసీ పట్నాయక్.. గత నెలలో ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో టాబ్లేష్ పాండే నియామకమయ్యారు.