న్యూఢిల్లీ : గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీలోనూ లేఆఫ్స్ వణికిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో రెండు శాతం మందికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం ఉద్వాసన పలికింది. దాదాపు 1600 మంది ఉద్యోగులపై మోర్గాన్ స్టాన్లీ వేటు వేసింది. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో పాటు పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కుదించింది.
కొద్ది మంది ఉద్యోగులను సాగనంపక తప్పదని ఇటీవల మోర్గాన్ స్టాన్లీ సీఈఓ జేమ్స్ గోర్మన్ ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ లేఆఫ్స్ బాంబు పేల్చిన కొద్దిరోజులకే కంపెనీ కొలువుల కోతను ప్రకటించింది. అన్ని వ్యాపార విభాగాల్లోనూ లేఆఫ్స్ ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఇక ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, సీఎన్ఎన్, స్నాప్ సహా పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా తాజాగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ పెద్దసంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందచేసింది. న్యూయార్క్‌కు చెందిన పెప్సీకో ఉత్తర అమెరికాలోని స్నాక్స్, బెవరేజెస్ విభాగంలో వందలాది ఉద్యోగులపై వేటు వేసేందుకు సంసిద్ధమైంది.