MCLR on Loans | పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గత రెండు నెలల్లో 90 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచేసింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు ఇచ్చే వివిధ రుణాలపై లెండింగ్ రేట్… మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచాయి. దీంతో నూతన రుణ గ్రహీతలకు, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై అదనపు భారం పడనున్నది. నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపులు పెరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్ని బ్యాంకులు తమ వడ్డీరేట్లు పెంచాయి. వాటిల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు పెంచేసిన ఎంసీఎల్ఆర్ రేట్లు, ఆయా బ్యాంకుల వారీగా వివిధ రుణాలపై వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో చూద్దామా!
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన అన్ని రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం ఏడాది గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.40 నుంచి 7.50 శాతానికి పెంచింది. ఆరు నెలల రుణంపై ఎంసీఎల్ఆర్ 7.35 నుంచి 7.45 శాతానికి, రెండేండ్ల టెన్యూర్ రుణంపై వడ్డీరేటు 7.7, మూడేండ్ల గడువు రుణంపై ఎంసీఎల్ఆర్ 7.8 శాతానికి పెంచివేసింది.
టెన్యూర్ ———– అమల్లో ఉన్న ఎంసీఎల్ఆర్ ——- సవరించిన ఎంసీఎల్ఆర్
ఓవర్‌నైట్ ———- 7.05 శాతం ————————– 7.15 శాతం
ఒక నెల ———— 7.05 శాతం ————————– 7.15 శాతం
3 నెలలు ———- 7.05 శాతం ————————— 7.15 శాతం
6 నెలలు —– —— 7.35 శాతం ————————– 7.45 శాతం
ఏడాది ————- 7.40 శాతం ————————— 7.50 శాతం
2 ఏండ్లు ———— 7.60 శాతం ————————– 7.70 శాతం
3 ఏండ్లు ———— 7.70 శాతం ————————– 7.80 శాతం
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివిధ టెన్యూర్ల రుణాలపై ఎంసీఎల్ఆర్ 20 బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఈ నెల ఏడో తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.50 నుంచి 7.70 శాతానికి, నెల టెన్యూర్ రుణంపై 7.75, మూడు నెలల టెన్యూర్ రుణంపై 7.80, ఆరు నెలల టెన్యూర్ రుణంపై 7.90 శాతం ఎంసీఎల్ఆర్ పెంచివేసింది. ఏడాది గడువు గల లోన్‌పై ఎంసీఎల్ఆర్ పెంపుతో పలు కన్జూమర్ రుణాలపై 8.05 శాతం, రెండేండ్ల గడువు రుణంపై 8.15, మూడేండ్ల గడువు గల లోన్‌పై ఎంసీఎల్ఆర్ 8.25 శాతం పెరిగింది.
టెన్యూర్ —– —– సవరించిన ఎంసీఎల్ఆర్
ఓవర్‌నైట్ ———- 7.70 శాతం
ఒక నెల ————- 7.75 శాతం
3 నెలలు ———— 7.80 శాతం
6 నెలలు —– —— 7.90 శాతం
ఏడాది ————– 8.05 శాతం
2 ఏండ్లు ———— 8.15 శాతం
3 ఏండ్లు ———— 8.25 శాతం
వివిధ టెన్యూర్ల రుణాలపై ఐసీఐసీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 20 బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.30 నుంచి 7.50 శాతానికి దూసుకెళ్లింది. నెల రోజుల టెన్యూర్ గల రుణంపై వడ్డీ 7.50, మూడు నెలల లోన్‌పై 7.55 శాతానికి పెరిగింది.
టెన్యూర్ —– —– సవరించిన ఎంసీఎల్ఆర్
ఓవర్‌నైట్ ———- 7.50 శాతం
ఒక నెల ————- 7.50 శాతం
3 నెలలు ———— 7.55 శాతం
6 నెలలు ———— 7.70 శాతం
ఏడాది ————— 7.75 శాతం
ఏదైనా రుణంపై బ్యాంక్ విధించే కనీస వడ్డీరేటే ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్). కాబట్టి అన్ని రుణాలు ఎంసీఎల్ఆర్తో అనుసంధానమై ఉంటాయి. నిర్దిష్ట మెచ్యూరిటీ కంటే తక్కువ గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ పెంచకూడదు. ఖాతాదారుల నుంచి సేకరించిన డిపాజిట్ల నుంచి రుణాలు ఇవ్వడానికి అయ్యే ఖర్చుల ఆధారంగా ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు ఖరారు చేస్తాయి. ఆయా బ్యాంకుల లావాదేవీలతోపాటు పలు అంశాల ఆధారంగా ఎంసీఎల్ఆర్ నిర్ణయిస్తాయి. వివిధ బ్యాంకుల ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటుంది.