Reliance | గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.03 లక్షల కోట్లు పెరిగింది. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గరిష్టంగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,387.18 పాయింట్లు లేదా 2.39% లాభంతో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 68.29 వేల కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ మినహా టాప్-10 స్క్రిప్ట్‌లు ఎం-క్యాప్ పెంచుకున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 68.29 వేల కోట్లు పెరిగి రూ.16.72 లక్షల కోట్లకు పెరిగింది. భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ. 30.120 కోట్లు వృద్ధి చెందింది. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5 లక్షల కోట్లకు చేరుకున్నది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 25.94 కోట్లు పెరిగి రూ. 6.32 లక్షల కోట్లకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.18.60 వేల కోట్లు వృద్ధి చెంది రూ. 6.23 లక్షల కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.38 వేల కోట్లు పెరిగి రూ.4.43 లక్షల కోట్ల వద్ద నిలిచింది.
ఐటీసీ ఎం-క్యాప్ రూ. 16.73 వేల కోట్ల లబ్ధితో రూ. 4.28 లక్షల కోట్లకు చేరుకున్నది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15.27 వేల కోట్లు లాభ పడి రూ. 11.48 లక్షల కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.10.96 వేల కోట్లు పెరిగి రూ. 6.31 లక్షల కోట్ల వద్ద నిలిచింది.
మరోవైపు, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.87 వేల కోట్లు నష్టంతో రూ. 4.35 లక్షల కోట్లతో సరిపెట్టుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.1.50 వేల కోట్ల పతనంతో రూ. 8.01 లక్షల కోట్లకు చేరుకుంది.
మోస్ట్ వాల్యుబుల్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.
శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ వరుసగా ఆరో రోజు లాభాలతో స్థిరపడింది. 104 పాయింట్ల లబ్ధితో సెన్సెక్స్ 59,307 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 17,576 పాయింట్ల వద్ద నిలిచింది.