గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు మెజారిటీ ట్రేడింగ్ సెషన్లలో లాభాలనే అందుకుని రికార్డు స్థాయిల్లో కదలాడాయి. అయితే ఆఖర్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు ఆల్టైమ్ హైల్లో స్థిరపడలేకపోయాయి. అయినప్పటికీ అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 217.13 పాయింట్లు పెరిగి 77వేల స్థాయికి ఎగువన 77,209.90 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 35.50 పాయింట్లు అందిపుచ్చుకుని 23,501.10 దగ్గర నిలిచింది. ఈ వారం సైతం సూచీలు ఓవరాల్గా లాభాల్లోనే కదలాడవచ్చన్న అంచనాలున్నాయి.
లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడినా.. చివరకు ఓ మోస్తరు వృద్ధినే చూస్తాయన్న అభిప్రాయాలు ఎక్కువమంది నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకునే వీలు కూడా లేకపోలేదంటున్నారు. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 23,300 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,800 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 23,600-23,800 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా అంటున్నారు.