UPI Charge | యూపీఐ లావాదేవీలకు చార్జీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సీఈఓ కం ఎండీ దిలీప్ అస్బే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడేండ్లలో పెద్ద వ్యాపారులు యూపీఐ లావాదేవీలపై సహేతుకమైన చార్జీలు చెల్లించాల్సి రావచ్చునని చెప్పారు. ‘యూపీఐ లావాదేవీలపై దీర్ఘకాలిక కోణంలో పెద్ద వ్యాపారులు సహేతుకమైన చార్జీలు చెల్లించాలి. ఇది చిన్న వ్యాపారులకు కాదు పెద్ద వ్యాపారులకే. ఇది ఒకటి, రెండు, మూడు సంవత్సరాల్లో అమల్లోకి రావచ్చు’ అని బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (బీసీఏఎస్) సదస్సులో దిలీప్ ఆస్బే మాట్లాడుతూ చెప్పారు. ఎంత ఫీజు చెల్లించాలన్న వివరాలను ఆయన వెల్లడించలేదు.
‘ఇంకా 30-50 కోట్ల మంది యూపీఐ చెల్లింపుల్లో రావాలి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు జరుపుతున్న వ్యాపారులతో పోలిస్తే రెండు లేదా మూడు రెట్లు పెరగాలి. సౌకర్యం గల వారు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టొచ్చు. డిజిటల్ చెల్లింపులు సురక్షితం, అవి ఇన్సెంటివ్ లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తాయి’ అని దిలీప్ అస్బే చెప్పారు.