హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామిక భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించిన మహారాష్ట్ర, గుజరాత్ల కన్నా మన రాష్ట్రంలో పరిశ్రమలకోసం కేటాయించే భూముల ధరలు పదిరెట్లు అధికంగా ఉండటం విశేషం. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడంలేదు. కాగా, సబ్సిడీ ధరలకు భూములను విక్రయించే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
పరిశ్రమను ఏర్పాటు చేయడానికి సహజంగా భూమి కొనుగోలుకే ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుందనే విషయం విధితమే. అయితే తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, సాగునీటి ప్రాజక్టుల నిర్మాణంతో భూముల ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. దీంతో పరిశ్రమల కోసం భూసేకరణ పెద్ద సమస్యగా మారింది. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం అరకొర నష్ట పరిహారం ఇస్తుండటంతో రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.
ఫలితంగా కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటుకు బదులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేకరించిన భూముల్లోనే పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయడంపై టీజీఐఐసీ దృష్టి సారించింది. ప్రస్తుతమున్న భూముల ధర, మౌలిక సదుపాయాలకు అవుతున్న ఖర్చులు కలుపుకొని టీజీఐఐసీ భూముల ధరలను నిర్ధారిస్తున్నది. రాష్ట్రంలో భూముల ధరలు పెరగడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ చిన్న పరిశ్రమలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు స్థాపించాలనుకునే పారిశ్రామికవేత్తలకు ఇవి అందుబాటులో లేకుండా పోవడం పరిశ్రమ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
ఉదాహరణకు హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో సుమారు వెయ్యి గజాల్లో ఓ చిన్న యూనిట్ పెట్టుకోవాలంటే భూమి కోసమే కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. యంత్రాలు, విద్యుత్, సివిల్ వర్క్స్ తదితర వాటికి అయ్యే ఖర్చు అదనం. ఒకవేళ హైదరాబాద్కు 100 కిలోమీటర్ల పరిధిలో యూనిట్ పెట్టాలనుకుంటే దీనికి రెట్టింపు ఖర్చవుతున్నది.
వంద కోట్లకు పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ అనుమతించనున్నది. వారు కోరిన విధంగా ప్రభుత్వం తక్కువ ధరకు భూములు, ఇతర రాయితీలు కల్పిస్తుంది. కానీ తక్కువ పెట్టుబడి ఉండే పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు మాత్రం టీజీఐఐసీ ద్వారా అనుమతిలిస్తారు. భూములు సైతం టీజీఐఐసీ నిర్ధారిత ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వారికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు, విద్యుత్ సహా ఇతర పన్నుల్లో రాయితీలు కల్పిస్తున్నారు తప్పా భూముల ధరల్లో మాత్రం రాయితీ ఇవ్వడంలేదు.
నూతన ఎంఎస్ఎంఈ విధానంలో లీజు విధానాన్ని ప్రవేశపెట్టారు. భూమి కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్నవారికి నిర్ణీత ధర ప్రకారం విక్రయించడంతోపాటు భూమి కొనుగోలు చేయలేనివారికి లీజు పద్ధతిలో భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు. అయితే, లీజు విధానంపై పరిశ్రమ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొనుగోలు చేసిన భూమిలో పరిశ్రమ ఏర్పాటుచేస్తే తరువాత తమ అవసరాలకు తగ్గట్టు విక్రయించే అధికారం ఉంటుందని, లీజు భూములను విక్రయించే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. కాగా, మరికొందరు మాత్రం లీజు విధానం వల్ల భూమిపై పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ మొత్తాన్ని ముడి సరుకు కొనుగోలుకు ఉపయోగించుకొని సులభంగా పరిశ్రమ నెలకొల్పే వీలు కలుగుతుంది.