హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పాలసీలతో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(GCC)కు హైదరాబాద్ రాజధానికి మారిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జీసీసీ సమ్మిట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీసీసీలను ఆకర్షించడంలో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగరం బెంగళూరును దాటి మరింత ప్రగతిని సాధించాలని కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.
హైదరాబాద్ జీసీసీ రాజధానిగా మారడం వెనక బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఎంతగానో ఉన్నదని, పదేండ్ల పాటు అన్ని రంగాల్లో నగరాన్ని సమగ్రంగా తీర్చిదిద్దడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. చార్టెడ్ అకౌంటెంట్లు సంప్రాదాయ అకౌంటింగ్ వృత్తికే పరిమితం కాకుండా గ్లోబల్ బిజినెస్ లీడర్షిప్ భాగస్వామ్యం కావడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. దేశంలో 1,600కు పైగా జీసీసీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటి ద్వారా 19 లక్షల మంది ఐటీ నిపుణులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. జీసీసీలకు పెరుగుతున్న డిమాండ్‌తో వచ్చే ఐదేండ్లలో వీటి సంఖ్య 2,500కి చేరుకుంటున్నదన్నారు. అలాగే 50 లక్షల మంది టెక్నాలజీ నిపుణులు మన ఆర్థిక వ్యవస్థను 100 బిలియన్ డాలర్లకు చేరుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఐటీ రంగం అభివృద్ధికి అనేక పాలసీలు తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యక్తుల ఆధారంగా కాకుండా వ్యవస్థను పటిష్ఠపర్చడం ద్వారా అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మడం వల్లనే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట టీఎస్ ఐపాస్‌ను ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్తగా కంపెనీ పెట్టాలనుకునే వారికి ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా ప్రభుత్వం అనుమతితో పని లేకుండా మొదటి రోజు నుంచే తమ కార్యకలాపాలు సాగించేలా వ్యవస్థను రూపొందించినట్టు వెల్లడించారు. తాము చొరవ చూపి తీసుకొచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నట్టు చెప్పారు.
ఈ చర్యల్లో భాగంగా ఆన్లైన్ ద్వారా తమ కంపెనీ వివరాలు అందించి కేవలం 15 రోజుల్లోనే పూర్తిస్థాయి అనుమతి పొందే వెసులుబాటు తీసుకొచ్చినట్టు వివరించారు. ఒక వేళ ఏదైనా కారణాలతో 15 రోజుల తర్వాత అనుమతి లభించకుంటే ఆ మరుసటి రోజు నుంచి నేరుగా ఆన్లైన్ ద్వారా అనుమతి వచ్చేలా టీఎస్ఐపాస్ రూపొందించినట్టు వివరించారు. అనుమతి ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి జరిమానా విధించేలా ఓ సిస్టమ్‌ను పకడ్భందీగా అమలు పర్చినట్టు పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ లాంటి కార్యక్రమం దేశంతో పాటు అమెరికాలో కూడా ఎక్కడా లేదని కేటీఆర్ తెలిపారు. తాము ప్రవేశపెట్టిన విధానంతో కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టినట్టు వివరించారు.
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించినట్టు కేటీఆర్ వెల్లడించారు. ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను టాస్క్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. జీసీసీ సెంటర్లలో సైతం టాస్క్ ద్వారా శిక్షణ పొందిన అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు. ప్రజల సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం వల్లనే ఈ ఫలితాలు సాధించగలిగామన్నారు. హైదరాబాద్ వారసత్వ కట్టడాలకు నిలయంగా విరాజిల్లుతున్నదని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆకాశహర్మ్యాలు మాన్హట్టన్ను తలపిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రో, అద్భుతమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇండస్ట్రీయల్ పార్క్, డాటా కనెక్టివిటీలను బీఆర్ఎస్ హయాంలో నిర్మించినట్టు వివరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్‌ను ఇక్కడే నిర్మించినట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపాలని జీసీసీ సమ్మిట్‌కు వచ్చిన ప్రతినిధులు, సీఏలను ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ప్రెసిడెంట్ చరణ్‌జోత్ సింగ్ నందా, వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్, కన్వీనర్ సంజీబ్ సంఘీ, డిప్యూటీ కన్వీనర్ అభయ్, శ్రీధర్ ముప్పాల, సంజీవ్ కుమార్ సింఘాల్, జై అజిత్, పురుషోత్తమ్లాల్ ఖండేల్వాల్, పంకజ్ షా, మధుకర్ నారాయణ్, కే శ్రీప్రీయ, ఐసీఏఐ సభ్యులు పాల్గొన్నారు.