హైదరాబాద్, మార్చి 21 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు.. వాణిజ్య ఎగుమతుల్లో ఫార్మా ఇండస్ట్రీని అధిగమించడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రం ఆయా రంగాల్లో పురోగతి సాధించడం ఆనందదాయకమని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ అండ్ డిఫెన్స్-2016 పాలసీ ఫలితమే ఈ విజయమని శుక్రవారం ఎక్స్ వేదికగా అభివర్ణించారు.
ఈ పాలసీ ద్వారా పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధనల అభివృద్ధి, స్వదేశీ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించడం జరిగిందని వివరించారు. 2016 నుంచి 2024 మధ్య విమానయాన, పర్యావరణ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని.. 2018, 2020, 2022, 2024 సంవత్సరాల్లో నాలుగుసార్లు అవార్డులను కూడా గెలుచుకున్నదని గుర్తుచేశారు.
టాప్-10 ఏరోస్పేస్ సిటీల్లో హైదరాబాద్ 2021లో నంబర్ వన్ స్థానంలో ఉందన్న ఆయన.. తమ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ైస్కెరూట్ ఏరోస్పేస్, ధ్రువ స్పేస్, ఆజాద్ ఇంజినీరింగ్, స్కంద ఏరోస్పేస్ లాంటి సంస్థలు, డిఫెన్స్ స్టార్టప్లకు హైదరాబాద్ నిలయంగా మారిందన్నారు. ఇక 30 వేల మంది ఆయా రంగాల్లో శిక్షణ పొందారని, 15 వేల మందికిపైగా ఉద్యోగాలు సాధించారని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం నాలుగు ఏరోస్పేస్, రెండు హార్డ్వేర్, 50 ఇంజినీరింగ్ పార్కులు ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఆచరించిన ప్రగతిశీల విధానాలతో తెలంగాణ ఏరోస్పేస్, ఢిపెన్స్ రంగాలు ఉన్నత శిఖరాలను అధిరోహించాయని కొనియాడారు.