హైదరాబాద్/మేడ్చల్/శామీర్‌పేట్, ఏప్రిల్ 25: జీనోమ్ వ్యాలీలో మరో విదేశీ సంస్థ కొలువుదీరింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ లాబొరేటరీస్ (ఫెర్రింగ్) ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.246 కోట్ల (30 మిలియన్ యూరోలు) పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని బలమైన శ్రామిక శక్తి, నైపుణ్యం, ప్రతిభలకుతోడు లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్.. నగరానికి ఫెర్రింగ్ లాబొరేటరీస్ రాకకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. నిజానికి ఈ సంస్థ మొదట్లో మహారాష్ట్రలో ప్లాంట్‌ను నెలకొల్పాలని చూసిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలతో అనుసరిస్తున్న స్నేహపూర్వక వైఖరి, మానవ వనరుల కారణంగా హైదరాబాద్‌కు తరలివచ్చిందన్నారు.
ఔషధ రంగంలో విస్తృత పరిశోధనలు
ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 12 పరిశోధనా-అభివృద్ధి కేంద్రాలున్నాయి. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన హైదరాబాద్ యూనిట్లో ఓ ఇంటిగ్రేటెడ్ రిసెర్చ్, డెవలప్మెంట్ వింగ్‌తోపాటు స్టేట్-ఆఫ్-దీ-ఆర్ట్ సౌకర్యాలున్నాయి. రిసెర్చ్, స్పెషాలిటీ బయోఫార్మాస్యూటికల్ గ్రూపైన ఫెర్రింగ్.. రీప్రొడక్టివ్ మెడిసిన్, మెటర్నల్ హెల్త్లపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. ప్రత్యేకంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ విభాగాల్లోనూ పరిశోధనలు చేస్తుంది. ఈ ప్లాంట్‌తో దాదాపు 110 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
మహిళల ఆరోగ్యంపై దృష్టి
జీనోమ్ వ్యాలీ క్లస్టర్లో మహిళల ఆరోగ్యంపై సంస్థలు దృష్టిపెట్టాయి. ఫెర్రింగ్ కంపెనీ సైతం తల్లీ, బిడ్డల ఆరోగ్యానికి కావాల్సిన మందులను తయారు చేస్తుంది. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్ ఫార్మా కృషి అభినందనీయమని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశంసించారు. ఇలాంటి కంపెనీలు ఇక్కడ ఉండటం శుభపరిణామంగా అభిప్రాయపడ్డారు. వాక్సినేషన్ హబ్‌గా హైదరాబాద్ మారిందన్న ఆయన.. ఫార్మా కంపెనీలకు తెలంగాణ అనుకూలంగా ఉంటుందన్నారు.
గ్లోబల్ కంపెనీలకు అడ్డా
హైదరాబాద్ నగరం.. అంతర్జాతీయ సంస్థలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నదని, గ్లోబల్ కంపెనీలకు అడ్డాగా మారిపోయిందని కేటీఆర్ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నో రంగాలకు చెందిన విదేశీ సంస్థలకు భాగ్యనగరంలో ప్రధాన కేంద్రాలు, సెంటర్లు, కార్యాలయాలున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, లైఫ్‌సైన్సెస్, విడిభాగాల తయారీలో హైదరాబాద్ పరుగులు పెడుతున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలున్నాయని పారిశ్రామికవేత్తలకు రాయితీలతోపాటు పూర్తి సహాయ, సహకారాలు ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు.