గీసుగొండ, నవంబర్ 1: కొరియాకు చెందిన టెక్స్టైల్ సంస్థ యంగవన్..తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్దమైంది. వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో రూ.840 కోట్ల పెట్టుబడితో 261 ఎకరాల స్థలంలో వస్త్ర పరిశ్రమను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ యూనిట్‌ను కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిహక్సాంగ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవల ఒక యూనిట్లో వస్ర్తాల ఉత్పత్తిని ప్రారంభించినట్టు, మిగతా ఆరు యూనిట్లలో వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు చెప్పారు.
మిగతా ఐదు యూనిట్లకు సంబంధించి అక్కడి కంపెనీ ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. పనుల్లో వేగం పెంచి వచ్చే మార్చి నాటికి అన్ని యూనిట్లలో ఉత్పత్తులను ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 300 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, మిగతా ఐదు యూనిట్లు అందుబాటులోకి వస్తే మొత్తం 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. వస్త్ర పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం అనువైనది కావడంతో ఇక్కవ యూనిట్‌ను నెలకొల్పాలని ముందుకొచ్చినట్టు చెప్పారు.