న్యూఢిల్లీ, జూలై 28: దేశీయ ద్విచక్ర వాహన విపణిలోకి కైనెటిక్ మళ్లీ వచ్చింది. ఒకప్పుడు భారతీయ టూవీలర్ మార్కెట్లో సత్తా చాటిన కైనెటిక్ స్కూటర్లు.. ఆ తర్వాతి కాలంలో కనుమరుగైపోయాయి. అయితే ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త అవతారంలో కంపెనీ రీ-ఎంట్రీ ఇచ్చింది. సోమవారం తమ ఐకానిక్ మాడల్ డీఎక్స్ పేరిటే డీఎక్స్, డీఎక్స్ ప్లస్ అనే రెండు విద్యుత్తు ఆధారిత స్కూటర్లను పరిచయం చేసింది. ఆకర్షణీయ ఫీచర్లతో వీటిని తీసుకురాగా, వచ్చే మూడేండ్లలో అమ్మకాలపరంగా మార్కెట్లోని ప్రధాన సంస్థల్లో ఒకటిగా ఉంటామన్న ఆశాభావాన్ని కైనెటిక్ ఇంజినీరింగ్ ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.
అలాగే రాబోయే 18 నెలల్లో రూ.177 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ అజింక్య ఫిరోదియా తెలిపారు. దశలవారీగా నెట్‌వర్క్‌ను, ఉత్పత్తిని పెంచుతామన్న ఆయన 3-4 ఏండ్లలో దేశవ్యాప్తంగా సుమారు 300 డీలర్‌షిప్‌లను అందుబాటులోకి తెస్తామని, 1.5 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధిస్తామన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఇక 2026 ఆగస్టుకల్లా దాదాపు 40వేల యూనిట్లను ఉత్పత్తి చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌కూ విస్తరించే యోచనలో ఉన్నట్టు వివరించారు. కాగా, పుణెకు చెందిన ఈ సంస్థ 1984 నుంచి 1998 వరకు డీఎక్స్ పేరుతో స్కూటర్లను విక్రయించిన విషయం తెలిసిందే.