హైదరాబాద్, సెప్టెంబర్ 17 : కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్ హాస్పిటల్స్)..తాజాగా కర్ణాటకలో అడుగుపెట్టింది. తన తొలి దవాఖానను బెంగళూరులో ప్రారంభించింది. 450 పడకల విస్తీర్ణంతో నెలకొల్పిన తొలి మల్టీ-స్పెషాల్టీ హాస్పిటల్లో 35 మెడికల్ అండ్ సర్చికల్ స్పెషాల్టీ, 120కి పైగా అడ్వాన్స్ ఐసీయూ బెడ్స్, 100కి పైగా అవుట్‌పేషెంట్ రూమ్స్ ఉన్నాయి.
ఈ సందర్భంగా కిమ్స్ సీఎండీ భాస్కర్ రావు మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో బెంగళూరులో తొలి దవాఖానను ప్రారంభించినట్టు, రోగులకు ఉత్తమ క్లీనికల్ సేవలు అందించడానికి ఎల్లప్పుడు మా వైద్య బృందం కృషి చేయనున్నట్టు చెప్పారు. అలాగే బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో రెండో దవాఖానను కూడా త్వరలో తెరవనున్నట్టు ఆయన ప్రకటించారు.