Kia India | ఆడి ఇండియా, హ్యుండాయ్ మోటార్ ఇండియా, మారుతి సుజుకి బాటలో మరో కార్ల తయారీ సంస్థ కియా ఇండియా వచ్చి చేరింది. జనవరి నుంచి కార్ల ధరలు రెండు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కమోడిటీ ధరలు, సప్లయ్ చెయిన్ కాస్ట్స్ పెరిగిపోవడంతో కార్ల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నెల 19న కంపాక్ట్ ఎస్యూవీ సిరోస్ (Syros)తోపాటు సోనెట్, సెల్టోస్, కరెన్స్, కార్నివాల్, ఈవీ6, ఈవీ9 కార్లను భారత్ మార్కెట్లో విక్రయిస్తోంది.
‘మా కస్టమర్లకు అత్యంత నాణ్యతతో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన వాహనాలను అందించడానికి కట్టుబడి ఉంది. నిరంతరం పెరిగిపోతున్న కమోడిటీ ధరలు, అననుకూల ఫారెక్స్ మార్కెట్ ఎక్చ్సేంజ్ రేట్స్, ఇన్ పుట్ కాస్ట్స్ పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరల సర్దుబాటు అనివార్యమైంది’ అని కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
2019 ఆగస్టులో సెల్టోస్ కారు ఆవిష్కరణతో భారత్ మార్కెట్లోకి ఎంటరైంది కియా ఇండియా. నాటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 16 లక్షల కార్లు విక్రయించింది. కియా ఇండియాతోపాటు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సంస్థలు జనవరి నుంచి కార్ల ధరలు పెంచుతామని ఇప్పటికే ప్రకటించాయి.