న్యూఢిల్లీ, జూలై 10: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను రాబోయే రెండు ద్రవ్య సమీక్షల్లోనైతే యథాతథంగానే ఉంచవచ్చని, డిసెంబర్ నుంచి మాత్రం పెంపులకు ఆస్కారం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్ అంచనా వేసింది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెరుగవచ్చని తెలిపింది. దీంతో ఈ ఏడాది ఆఖర్లో రుణాలపై వడ్డీరేట్లూ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
గత ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం విజృంభిస్తుండటమే కారణం. ఇన్నాళ్లూ దేశ జీడీపీ వృద్ధిరేటుకు ప్రాధాన్యాన్ని ఇస్తూ వస్తున్న సెంట్రల్ బ్యాంక్.. ఇకపై ధరల అదుపునకే పెద్దపీట వేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందుకు బొఫా తాజా అంచనా సైతం అద్దం పడుతున్నది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభం..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్న సంగతి విదితమే. దీనికిప్పుడు ఎల్ నినో కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండకపోవడం తోడవుతున్నది. దీంతో రాబోయే నెలల్లో రిటైల్, హోల్సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం సూచీ బాగానే పెరిగేలా ఉన్నాయి. ఇదే జరిగితే వడ్డీరేట్ల పెంపు ఖాయమన్న విశ్లేషణలే ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులతో గ్రామీణ భారతం ఎక్కువగా ప్రభావితం కావచ్చని అంచనాలున్నాయి.
ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచితే బ్యాంకులూ రుణాలపై వడ్డీరేట్లను పెంచేస్తాయి. దీనివల్ల కీలక రంగాలకు రుణ సాయం భారమవుతుందని, ఇది చివరకు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయవచ్చని బొఫా హెచ్చరించింది. ఇప్పటికే ఉత్పాదక రంగం ఒత్తిడిలో ఉన్నది. ఈ క్రమంలో పెరిగే వడ్డీరేట్లు నిర్మాణ, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల వృద్ధినీ అడ్డుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ కుంటుపడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత నెల ద్రవ్య సమీక్షలో.. ఇకపై వడ్డీరేట్ల పెంపులుండవచ్చన్న సంకేతాలు ఆర్బీఐ నుంచి వచ్చినది తెలిసిందే. ఈ క్రమంలో బొఫా అంచనా ప్రాధన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు.