న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 8 మౌలిక రంగాలు నీరసించిపోయాయి. 2023 సెప్టెంబర్ నెలలో వీటి వృద్ధి రేటు 4 నెలల కనిష్ఠానికి పడిపోయింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం, ముడి చమురు ఉత్పత్తి దెబ్బతినడంతో సెప్టెంబర్‌లో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు 8.1 శాతానికి పరిమితయ్యినట్టు మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం 2023 మే నెలలో 5.2 శాతం కనిష్ఠవృద్ధిని కనపర్చిన ఈ రంగాలు జూన్, జులైల్లో 8.4 శాతం చొప్పున, ఆగస్టులో 12.5 శాతం మేర వృద్ధి చెందాయి. కానీ సెప్టెంబర్‌లో తిరిగి వృద్ధి రేటు 8.1 శాతానికి తగ్గింది. నిరుడు ఇదే నెలలో వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో కూడా గత ఏడాదితో పోలిస్తే మౌలిక రంగాల వృద్ధి 9.8 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ నెలలో రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి 5.5 శాతానికి నెమ్మదించగా, ఎరువుల ఉత్పత్తి వృద్ధి రేటు 4.2 శాతానికి, సిమెంట్ ఉత్పత్తి వృద్ధి 4.7 శాతానికి, విద్యుదుత్పత్తి వృద్ధి 9.3 శాతానికి పరిమితమయినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వివరించింది. క్రూడాయిల్ ఉత్పత్తి 0.4 శాతం క్షీణించింది. కానీ బొగ్గు ఉత్పత్తి గణనీయంగా 16.1 శాతం పెరగడం గమనార్హం. సహజవాయువు ఉత్పత్తి 6.5 శాతం, ఉక్కు ఉత్పత్తి 9.6 శాతం చొప్పున వృద్ధిచెందాయి. ఈ కీలక రంగాల వృద్ధిని పరిశీలిస్తే, త్వరలో వెల్లడికాబోయే పారిశ్రామికోత్పత్తి వృద్ధి సైతం సింగిల్ డిజిట్‌కు పరిమితం కావచ్చని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అంచనా వేశారు. పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ)లో ఈ 8 మౌలిక రంగాలకు 40 శాతం వెయిటేజి ఉన్నది.