యూరియా విక్రయ ధరలను పెంచి, ఆ పెంచిన మొత్తాన్ని రైతులకు ఎకరాల వారిగా బదిలీ చేయడం ద్వారా ఈ ఎరువు వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతుల కొనుగోలు సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చని ఆర్థిక సర్వే సూచించింది. నగదు బదిలీ ప్రక్రియను మొదలు పెట్టడం వల్ల తక్కువగా యూరియాను కొనుగోలు చేసే రైతులు అధిక నగదు బదిలీ పొంది ఆర్థికంగా లాభపడతారని పేర్కొంది. అదే విధంగా ఎక్కువ మొత్తంలో యూరియా వినియోగించే రైతులు దీనికి బదులుగా ఇతర సంప్రదాయ ఎరువుల వైపు వెళ్తారని సూచించింది.

ముఖ్యంగా వర్షాధార పంటలు పండించే రైతులు నికర ఆదాయాన్ని పొందుతారని పేర్కొంది. దేశంలో ప్రతియేట యూరియా వినియోగం పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. దీంతో అటు భూమి, ఇటు పంటలు విషతుల్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత మేరకు యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే యూరియా ధర పెంచి, ఆ మొత్తాన్ని రైతులకు నగదు బదిలీ రూపంలో ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది.
మన దేశం లో ఊబకాయం వేగంగా పెరుగుతున్నదని, ఇది నేడు ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులు, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, శారీరక చురుకుదనం లేకుండా పని చేయడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం పెరగడం, పర్యావరణ అంశాలు ఈ సమస్యకు దారి తీస్తున్నట్లు తెలిపింది. ఊబకాయం అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నది.

మధుమేహం, గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్ వంటి అసాంక్రమిక వ్యాధుల ముప్పు పెరుగుతున్నదని తెలిపింది. ఈ ప్రభావం గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై పడుతున్నట్లు వివరించింది. ప్రభుత్వం ఈ నివేదికను గురువారం పార్లమెంట్‌కు సమర్పించింది. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం, దేశంలోని 21 శాతం మంది మహిళలు, 23 శాతం మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. 15-49 ఏండ్ల మహిళల్లో 6.4 శాతం మంది, పురుషుల్లో 4 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.
దేశంలోని 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ.15 వేల కన్నా తక్కువే ఆర్జిస్తున్నారని ఆర్థిక సర్వే 2025-26 వెల్లడించింది. గిగ్ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన విధాన జోక్యాన్ని చేపట్టాలని పిలుపునిచ్చింది. శాశ్వత ఉద్యోగాలు లేకుండా ఒప్పందంపై పనిచేసే వారినే గిగ్ కార్మికులంటారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ సంస్థల్లో డెలివరీ/డ్రైవర్, ఇతర తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారందరూ ఈ కోవకే వస్తారు. వీరికి న్యాయమైన వేతనాలను నిర్ధారించడానికి, సాధారణ, గిగ్ ఉపాధి మధ్య వ్యయ అసమానతను తగ్గించడానికి వారి వెయిటింగ్‌కు పరిహారంతో సహా కనీసం గంటకు లేదా ప్రతి పనికి ఆదాయాన్ని ఏర్పాటు చేయాలని ఆర్థిక సర్వే సూచించింది.

ఈ సర్వేలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి పలు సూచనలు చేసింది. వారి టార్గెట్ నిబంధనలను పునర్ నిర్మించాలని, గిగ్లను బలవంతం చేయకుండా నిజమైన ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నది. దేశంలో గ్రిగ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఆదాయ అస్థిరత ఒక కీలక సమస్యగా మిగిలిపోయిందని అభిప్రాయపడింది.
అత్యధిక కొవ్వు, ఉప్పు, తీపిదనంతో కూడిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం దేశంలో పెరుగుతుండటంపై కేంద్ర ఆర్థిక సర్వే నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ఉత్పత్తులకు ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న మార్కెట్లలో మన దేశం ఒకటిగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఈ ఉత్పత్తుల ప్రకటనలపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిషేధం విధించాలని ఈ నివేదిక సూచించింది. శిశువులు, చిన్నారులకు ఇచ్చే పాలు, బేవరేజెస్ మార్కెటింగ్‌పై కూడా ఆంక్షలు విధించాలని చెప్పింది.

పిల్లల్లో ఊబకాయం సమస్య పెరుగుతున్నదని తెలిపింది. ప్యాకెట్లపైన లేబుల్స్ ద్వారా అధిక కొవ్వు, షుగర్, సాల్ట్ గురించి హెచ్చరించాలని సలహా ఇచ్చింది. వీటిని బాలలకు మార్కెటింగ్ చేయడంపై ఆంక్షలు విధించాలని తెలిపింది. వాణిజ్య ఒప్పందాలు ప్రజారోగ్య విధానానికి విఘాతం కలిగించకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. చిలీ, నార్వే, యూకేలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రకటనలపై ఆంక్షలు అమల్లో ఉన్నాయని తెలిపింది.
ఆర్థిక సర్వే దేశంలోని పిల్లలు, యువతలో డిజిటల్ వ్యసనం వేగంగా పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల దేశానికి మానసిక ఆరోగ్య సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది. స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, గేమింగ్, ఆన్లైన్ ప్లాట్‌ఫారాల్లో ఎక్కువ సేపు గడుపుతున్న తీరు ఆరోగ్యంపై, అభ్యసన ఫలితాలపై, దీర్ఘకాల ఆర్థిక ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నదని ఈ వ్యసనం పోకడలను వివరించింది. ‘యువ యూజర్లు హానికారక, వ్యసనపూరిత కంటెంట్ ప్రభావానికి లోనవుతున్న తరుణంలో వయసుల ఆధారంగా సోషల్ మీడియా వాడకంపై పరిమితి విధించే విధానాల అమలును పరిశీలించాలి’ అని సీఈఏ వీ అనంత నాగేశ్వరన్ తెలిపారు.

డిజిటల్ వ్యసనం ఆన్లైన్ ఖర్చులకు, గేమింగ్‌కు, సైబర్ నేరాలకు దారి తీస్తున్నదని, పరోక్షంగా ఉద్యోగిత, ఉత్పాదకత, జీవిత కాల ఆదాయాలను తగ్గిస్తున్నదని సర్వే పేర్కొన్నది. డిజిటల్ వ్యసనాన్ని కట్టడి చేసేందుకు సైబర్ భద్రత విద్య అమలు, మెంటార్లతో మార్గదర్శనం, శారీరక వ్యాయామం అవసరం.
రెండు దశాబ్దాల నాటి సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టాన్ని పునః పరిశీలించాలనే బలమైన వాదనను ఆర్థిక సర్వే గురువారం కేంద్రం ముందుకు తెచ్చింది. గోప్య నివేదికలు, ముసాయిదా వ్యాఖ్యలను బహిర్గతం చేయకుండా ఉంచే నిబంధనలు పాలనను పరిమితం చేస్తాయని పేర్కొన్నది. ‘దీన్ని పునః పరిశీలించాలని చెప్పడం దీని స్ఫూర్తిని నీరుగార్చమని చెప్పడం కాదు.. ప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులను ఈ చట్టంలో అమలు చేయడం, ఈ చట్టం అసలు ఉద్దేశానికి దృఢమైన పునాది వేయడం’ అని సర్వే నివేదిక పేర్కొన్నది.
ఆర్టీఐ చట్టంలో సాధ్యమైన సర్దుబాట్లను చేయాలని సర్వే సూచించింది. ప్రజా ప్రయోజనానికి తక్కువ విలువ జోడించే సాధారణ అభ్యర్థనల నుంచి సర్వీస్ రికార్డులు, బదిలీలను, గోప్యంగా ఉంచాల్సిన సిబ్బంది నివేదికలను మినహాయించాలని తెలిపింది. పాలనను అనవసరంగా పరిమితం చేయగల వెల్లడింపులను నిరోధించడానికి అవసరమైన మినిస్టీరియల్ వీటోను(మంత్రికి ఉండే న్యాయపర అధికారం) పార్లమెంటరీ పర్యవేక్షణకు లోబడి అమలు చేయవచ్చని సర్వే తెలిపింది. తమ సూచనలు ఆదేశాలు కాదని, చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి ఇచ్చిన సలహాలని సర్వే పేర్కొన్నది.
దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ మూలాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను భారత్ సమర్థవంతంగా ఎదర్కోగలదు. జీడీపీ వృద్ధిరేటు 7 శాతాన్ని చేరుతుంది.
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
తయారీ, ఎగుమతి రంగాల బలోపేతం, సంస్కరణలపై దృష్టిపెడితే రాబోయే కొన్నేండ్లలో భారత్ వృద్ధిరేటు 7.5-8 శాతానికి పెరుగగలదు. అయితే రాయితీలు, ప్రోత్సాహకాలు అవసరం. ఉత్పాదక వ్యయం కూడా తగ్గాలి. ఇక రాష్ర్టాల ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం.. కేంద్ర ప్రభుత్వ రుణాలను ప్రభావితం చేయగలదు. వడ్డీ భారాన్ని పెంచగలదు.
-వీ అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు