Gold Seize | కేరళలో బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన త్రిసూర్‌లో రాష్ట్ర జీఎస్టీ అధికారులు 104 కిలోల బంగారం జప్తు చేశారు. దీని విలువ రూ.75 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ బంగారానికి సంబంధిత వ్యాపారుల వద్ద సరైన రికార్డుల్లేవని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. ‘టొర్రే డెల్ ఓరే (టవర్ ఆఫ్ గోల్డ్)’ అనే పేరుతో జీఎస్టీ అధికారులు 78 చోట్ల తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మొదలైన తనిఖీలు గురువారం వరకూ కొనసాగాయి. జ్యువెల్లరీ వ్యాపారులు గత ఆరు నెలలుగా జీఎస్టీ ఫ్రాడ్ చేశారని ఆరోపణలు రావడంతో జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కేరళ రాష్ట్ర జీఎస్టీ స్పెషల్ కమిషనర్ అబ్రహం రెణ్ ఎస్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ పేరుతో అధికారులను రప్పించారు.
ముంబై విమానాశ్రయం పరిధిలో రూ.7.69 కోట్ల విలువైన 9.4 కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ప్రయాణికులు పట్టుబడ్డారని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) గురువారం తెలిపింది.ఫేక్ గుర్తింపు కార్డులతో ఇద్దరు ప్రయాణికులు జైపూర్ నుంచి ముంబైకి వస్తున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. వారి వద్ద గల మూడు లగేజీ ప్యాకెట్లను తనిఖీ చేయగా విదేశాల నుంచి తరలిస్తున్న 9.487 కిలోల బంగారం దొరికిందని పేర్కొన్నారు. ఆ ఇద్దరు ప్రయాణికులను విచారించగా, తాము కువైట్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఫేక్ గుర్తింపు కార్డులతో ప్రయాణం చేస్తున్నారన్నారు. వారిద్దరినీ కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ల కింద అరెస్ట్ చేశామని డీఆర్ఐ అధికారులు చెప్పారు.