Aadhaar : కేంద్ర ప్రభుత్వం తన పాలసీలలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. ప్రభుత్వంతోపాటు రైల్వేలాంటి ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో నిరంతరం మార్పులు జరుగుతుంటాయి. విధానాల్లో మార్పులతోపాటు ధరల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి ఎక్కువగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి అమలవుతాయి. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి వివిధ అంశాల్లో పాలసీల పరంగా, ధరల పరంగా రాబోతున్న కొన్ని కీలక మార్పులివి.
ఆధార్-ఈమెయిల్ అప్డేట్ ఉచితం
ఆధార్‌తో ఈ మెయిల్ అప్డేట్ చేసుకోవడం ఇకపై ఉచితం. ఆధార్‌తో ఈ మెయిల్ లింక్ చేసుకోవడం లేదా అప్డేట్ చేసుకోవడాన్ని ఉచితం చేస్తూ ‘ద యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)’ నిర్ణయం తీసుకుంది. గతంలో దీనికి రూ.75 ఛార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉచితంగా ఈ సర్వీస్ వాడుకోవచ్చు. అయితే, కొత్త ఆధార్ యాప్ ద్వారా మాత్రమే ఇది సాధ్యం. వేరే మార్గాల్లో అప్డేట్ చేసుకుంటే నిర్దిష్ట రుసుము చెల్లించాల్సిందే.
పాస్‌పోర్ట్ ధరల పెంపు
జూలై 1 నుంచి పాస్‌పోర్ట్ ఫీజుల్ని కేంద్రం పెంచింది. 14 ఏళ్ల తర్వాత ఈ ఫీజుల ధరల్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం.. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు గతంలో రూ.1,500 ఫీజు ఉండగా, ఇప్పుడు రూ.2,500 చెల్లించాలి. తత్కాల్ పాస్‌పోర్ట్‌కు గతంలో రూ.3,500 ధర ఉండగా, ఇప్పుడు రూ.5,000 చెల్లించాలి. ఇతర ఫీజుల్లో కూడా మార్పులు చేసింది.
రైళ్లలో టిక్కెట్ లేకుంటే ఫీజు రెట్టింపు
రైళ్లలో టిక్కెట్ లేకుండా చేసే ప్రయాణానికి సంబంధించి ఫీజును కూడా రైల్వే శాఖ రెట్టింపు చేసింది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఇంతకుముందు రూ.250 ఫీజు ఉండేది. ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రైల్వేస్ యాక్ట్ 1989లోని సెక్షన్ 137, సెక్షణ్ 138లను సవరిస్తూ తీసుకొచ్చిన జన్ విశ్వాస్ (అమెండ్మెంట్) యాక్ట్, 2026 ప్రకారం ఈ మార్పుచేసింది. అయితే, రైల్వేల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే కోర్టులు విధించే శిక్షల్లో ఏ మార్పులు లేవు. అవి ఆరు నెలల వరకు జైలు శిక్ష. అలాగే, రూ.1,000 జరిమానా.
క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో మార్పు
ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డు రివార్డ్స్‌కు సంబంధించి రూల్స్‌ను ఎస్బీఐ మార్చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా రిగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డుకు సంబంధించి మార్పులు చేసింది. ఈ రూల్స్ ప్రకారం.. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో యాక్సెస్ కావాలంటే గడిచిన మూడు నెలల్లో రూ.60,000 స్పెండ్ చేసి ఉండాలి.
చమురుపై ఆంక్షలు తొలగింపు
పశ్చిమాసియా సంక్షోభం సందర్భంగా దేశంలో చమురు వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఒక భారీ వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల చమురు మాత్రమే పోయాలి. అలాగే, ఇండస్ట్రియల్, కమర్షియల్ అవసరాలకు వాడే చమురుపై కూడా ఆంక్షలు విధించింది. వీటిని జూలై 1 నుంచి తొలగించనుంది.
గ్యాస్ ధరల్లో మార్పు
ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ, ఏటీఎఫ్ చమురు ధరల్ని కేంద్రం సవరిస్తుంది. జూలై 1న కొత్త ధరల్ని ప్రకటిస్తారు. దీనికి అనుగుణంగా కొత్త ధరలు అమలవుతాయి. కొంతకాలంగా వీటి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈసారి మాత్రం ధరల్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
పెరగనున్న వాహనాల ధరలు
జూలై 1 నుంచి అనేక వాహనాల ధరలు పెరుగుతాయి. పలు ప్యాసింజర్ వాహనాల ధరలు 1.5 శాతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. అలాగే, వాణిజ్య వాహనాల ధరల్ని 2.5 శాతం పెంచబోతున్నట్లు తెలిపింది. కియా మోటార్స్ కూడా తమ వాహనాల ధరల్ని 2 శాతం పెంచనుంది.