Jio Air Fiber | రిలయన్స్ 5జీ బేస్డ్ బ్రాడ్ బాండ్ సేవలందించే ‘జియో ఎయిర్ ఫైబర్’ సర్వీసులను మరికొన్ని నగరాలకు విస్తరించింది. తొలుత ఎనిమిది మెట్రో పాలిటన్ నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, పుణె నగరాలకు అందించిన జియో.. తాజాగా దీపావళి సందర్భంగా మరో 115 నగరాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం జియో ప్రత్యేకంగా తన వెబ్సైట్లో ఏర్పాటు చేసిన పేజీలో ‘జియో ఎయిర్ ఫైబర్’ అందుబాటులో ఉండే నగరాలు, పట్టణాల జాబితా ప్రచురించింది. తెలంగాణలో 19, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 11 నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్, నిజామాబాద్, పాల్వంచ, పెద్దపల్లి, రామగుండం, సంగారెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, తాండూరు, వరంగల్ ప్రాంతాలకు ‘జియో ఎయిర్ ఫైబర్’ అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమహేంద్రవారం, కర్నూల్, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ సర్వీసులు పొందొచ్చు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ బ్రాడ్ బాండ్ సర్వీసుల్లో 550కి పైగా డిజిటల్ టీవీ చానెళ్లు, 16కు పైగా ఓటీటీ యాప్‌లు, స్మార్ట్ హోం సేవలు పొందొచ్చు.