ముంబై, ఆగస్టు 13: ఆభరణాల ఎగుమతులు భారీగా పుంజుకుంటున్నాయి. జూలై నెలలో 2,178.24 మిలియన్ డాలర్ల (రూ.18,756.28 కోట్లు) విలువైన జెమ్, జ్యూవెల్లరీలు ఇతర దేశాలకు ఎగుమతి అ య్యాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజీఈపీసీ) తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతైన 1,878.08 మిలియన్ డాలర్లు (రూ.15,700 కోట్లు) పోలీస్తే 15.98 శాతం పెరిగాయని పేర్కొంది.
అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఎగుమతులను నియంత్రించాయని లేకపోతే భారీగా పెరిగే అవకాశం ఉన్నదని తన నివేదికలో వెల్లడించిం ది. జూలై ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నాయని, విలువైన ఆభరణాలకు విదేశాల్లో డి మాండ్ నెలకొనడం కలిసోస్తున్నదని, హాం కాంగ్ మార్కెట్లో మన ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉండటం కూడా కారణమని జీజేఈపీసీ చైర్మన్ కిరిట్ భన్సాలీ తెలిపారు.
బంగారం ధరలు మరింత తగ్గాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు బుధవారం మరింత దిగువముఖం పట్టాయి. గరిష్ఠ స్థాయిలో ధరలు ఉండటంతో కొనుగోళ్లకు డిమాండ్ పడిపోవడంతో స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా వీటి ధరలు బుధవారం మరో రూ.500 తగ్గాయి. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,01,020కి పరిమితమైంది.
గత మూడు రోజుల్లో ధర రూ.2,500 తగ్గినట్టు అయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర కూడా అంతే స్థాయిలో తగ్గి రూ.1,00,600గా నమోదైంది. కానీ, వెండి ధరలు యథాతథంగా ఉన్నాయి. కిలో వెండి రూ.1.12 లక్షల వద్ద ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 10.79 డాలర్లు పెరిగి 3,358.99 డాలర్లు పలుకగా, వెండి 38.51 డాలర్లుగా ఉన్నది.