Jewellers | అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం దాదాపు ఒకే ధరకు లభిస్తుంది. కానీ దేశీయ బులియన్ మార్కెట్లో నగరానికో రేట్ ధరకు లభ్యం అవుతుంది. ఒకే ధరకు బంగారం దిగుమతి చేసుకుంటున్నా, నగరాల వారీగా వేర్వేరు ధరలు ఉంటున్నాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) కౌన్సిల్ కార్యదర్శి మితేశ్ ధోడ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో దేశమంతటా ఒకే బంగారం ధర కోసం ‘వన్ నేషన్ – వన్ గోల్డ్ రేట్’ విధానం అమలు కోసం కసరత్తు చేస్తున్నామని అన్నారు.
ఈ నేపథ్యంలో ఒకే ధర విధానం అమలు చేసేందుకు దేశంలోని రిటైల్ వ్యాపారులకు నచ్చ జెప్పేందుకు జీజేసీ ప్రయత్నిస్తున్నది. ఒకే దేశం- ఒకే బంగారం ధర క్యాంపెయిన్ కింద ఈ నెల 22 నుంచి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు ‘లక్కీ లక్ష్మి’ అనే పేరుతో యాన్యువల్ గోల్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మితేశ్ ధోడ్రా వెల్లడించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తమ కౌన్సిల్ లో సభ్యులతో 50కిపైగా సమావేశాలు జరిపింది జీజేసీ. దేశవ్యాప్తంగా 8000 జ్యువెల్లరీ వ్యాపారులు జీజేసీలో సభ్యులుగా ఉన్నారు. ఒకే దేశం- ఒకే బంగారం ధర అమలు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వనున్న కౌన్సిల్.. ప్రస్తుతం జ్యువెల్లరీ వ్యాపారులకు నచ్చ చెప్పడంపై దృష్టిని కేంద్రీకరించింది.
తమ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేసేందుకు వాట్సాప్ బ్రాడ్ కాస్ట్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని మితేశ్ ధోడ్రా వెల్లడించారు. దశల వారీగా కనీసం నాలుగైదు లక్షల మంది రిటైల్ వ్యాపారులను చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక లక్కీ లక్ష్మి ఫెస్టివల్లో 1500 మంది రిటైల్ వ్యాపారులు, 8 లేదా తొమ్మిది చైన్ స్టోర్లు పాల్గొంటాయని జీజేసీ అంచనా వేస్తోంది. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో రూ.25 వేల విలువైన బంగారం కొనుగోలు చేసిన కస్టమర్లకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ ఫెస్టివల్ సీజన్లో కస్టమర్లకు రూ.10 కోట్ల విలువైన బహుమతులు అందజేస్తారు.