Jairam Ramesh : బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంలో అంతర్యం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సుంకాన్ని దాదాపు సగానికి తగ్గించడం వెనుక లాజిక్ ఏమున్నదంటూ నిలదీసింది. పసిడిపై సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో దిగుమతులను ఓ కంట కనిపెట్టాల్సి ఉంటుందంటూ కోటక్ మహీంద్రా ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నీలేశ్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ ఈ విధంగా స్పందించింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘ఆర్థిక రంగంలో నీలేశ్ షా బాగా ఫేమస్. ప్రధాన మంత్రి ఎనకమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడు కూడా. అందరిలా కాకుండా ఆయన కేవలం ఆర్థిక విషయాల గురించే మాట్లాడతారు. బంగారం దిగుమతులపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది’ అని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.
2023-24లో 45.5 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయ్యిందని, గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిందన్నారు. బంగారం దిగుమతులు పెరగడంవల్ల ఆర్థిక వృద్ధికి చేకూరే ప్రయోజనమూ స్వల్పమేనని తెలిపారు. అలాంటప్పుడు బడ్జెట్లో సుంకాన్ని జీఎస్టీతో కలుపుకుంటే 18.5 శాతం ఉన్న సుంకాన్ని సగానికి అంటే 9 శాతానికి తగ్గించడం వెనుక లాజిక్ ఏమిటి..? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఏటా 700 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, సుంకం తగ్గింపువల్ల ఈ బిల్లు మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్‌తో ఓ టీవీ కార్యక్రమంలో షా పేర్కొన్నారు. అలాగైతే బంగారం దిగుమతుల బిల్లు చమురు బిల్లును మించిపోయే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జైరాం రమేశ్ తన ప్రశ్నను లేవనెత్తారు.