Jaguar Land Rover | టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాలో 1.21 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేయబోతోంది. కారు సస్పెన్షన్‌లో లోపమే ఇందు కారణమని తెలుస్తున్నది. ఈ రీకాల్‌లో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ వంటి మోడల్స్ ఉన్నాయి. కంపెనీ సాంకేతిక నిపుణులు ఈ వాహనాలను తనిఖీ చేయనున్నారు. లోపాన్ని ఉచితంగానే సవరించనున్నారు. ఈ కార్ల ముందు భాగంలోని సస్పెన్షన్‌లోని అల్యూమినియం నకిల్స్ (ముందు చక్రాన్ని బ్రేక్ సిస్టమ్ ఇతర ముఖ్యమైన భాగాలకు అనుసంధానించేవి) సమస్య ఉందని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) తెలిపింది. లోపం కారణంగా ఆయా భాగాలు విరిగిపోవచ్చని.. వాహనం వేగంలో ఉన్న సమయంలో తీవ్రమైన ప్రమాదానికి కారణమవుతుందని పేర్కొంది. యూఎస్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ జూన్‌లో దర్యాప్తు ప్రారంభించిన తర్వాత రీకాల్ చేయనున్నారు.
ఇందులో దాదాపు 91,856 వాహనాల్లో ఫ్రంట్ స్టీరింగ్ నకిల్స్ విరిగిపోయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు తగ్గడం, యూఎస్ సుంకాల కారణంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ రీకాల్ జరుగుతున్నది. ఇటీవల, టాటా మోటార్స్ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.4,003 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.10,587 కోట్ల కంటే 62.2 శాతం తక్కువ. తక్కువ అమ్మకాలు, యూఎస్ టారిఫ్‌ల కారణంగా JLR లాభాలు తగ్గడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. గత త్రైమాసికంలో JLR ఆదాయం సంవత్సరానికి 9.2 శాతం తగ్గి 6.6 బిలియన్ పౌండ్లకు చేరుకుంది. టారిఫ్‌లు, హోల్‌సేల్ వాల్యూమ్ తగ్గడం, పాత జాగ్వార్ మోడళ్లను క్రమంగా నిలిపివేయాలనే ప్రణాళికలు ఈ తగ్గుదలకు కారణమని కంపెనీ పేర్కొంటున్నది. ఇదిలా ఉండగా.. త్వరలో కంపెనీలో నాయకత్వం మారబోతున్నది. ఈ ఏడాది నవంబర్ 17 నుంచి పీబీ బాలాజీ జేఎల్ఆర్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.