ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సంబంధించి దేశంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త, పాత పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. పాత పన్ను విధానానికి అంతా గుడ్‌బై చెప్పేలా చేయాలని కేవలం కొత్త పన్ను విధానాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఏటేటా బడ్జెట్లో ఆకర్షణీయంగా మారుస్తున్న సంగతీ విదితమే. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితుల్ని గణనీయంగా పెంచారు. అయినప్పటికీ ఇంకా కొందరు ట్యాక్స్‌పేయర్స్ పాత పన్ను విధానంలోనే తమ ఐటీఆర్‌లను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 మదింపు సంవత్సరం) సంబంధించి ఇప్పుడు ఐటీఆర్‌లు దాఖలుచేసేవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే వివిధ క్లెయిమ్‌ల కోసం కఠిన నిబంధనల్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను మినహాయింపుల కోసం సవివరంగా సమాచారం ఇవ్వాలని కొత్త నిబంధనలు చెప్తున్నాయి మరి.
ఐటీఆర్‌లకు సంబంధించి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. పన్ను మినహాయింపుల కోసం చేసే క్లెయిములపై నిఘా పెంచింది. ఇందులోభాగంగానే తప్పుడు క్లెయిములకు కళ్లెం వేసేలా చర్యలు చేపట్టింది. అంతేగాక తప్పులు లేకుండా ఐటీ రిటర్న్స్ ప్రక్రియను వేగవంతం చేయడానికి వెరిఫికేషన్ ప్రక్రియను ఆటోమెటిక్ చేసింది. మరోవైపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఐటీఆర్ దాఖలుకున్న గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 15దాకా పొడిగించింది. సెక్షన్ 80సీ, 80డీ, 24బీ వంటి వాటికింద పన్ను మినహాయింపులను కోరేవారు అందు కు కావాల్సిన అన్ని ధ్రువపత్రాలను సిద్ధం
చేసుకోవాలనే ఈ పొడిగింపు. దీంతో పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలనుకొనే ట్యాక్స్‌పేయర్స్ ముందే డాక్యుమెంట్లను సరిచూసుకోవడం చాలాచాలా అవసరం. లేకపోతే పన్ను పోటు తప్పదని ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు.
మదింపు సంవత్సరం 2025-26 కోసం ఉద్యోగులు తీసుకునే తమ ఫామ్ 16లో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వేతనాలు, వాటిలోని కోతలు, పన్ను మినహాయింపులకు సంబంధించిన మరింత సమాచారంతో ఇది ఉండనున్నది. వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేసేవారికి ఫామ్ 16 తప్పనిసరి.