ముంబై, ఫిబ్రవరి 10: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. ఒకానొక దశలో 50 పైసలు క్షీణించి 88 దరిదాపుల్లోకి దిగజారింది. ఆల్‌టైమ్ ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకుతూ 87.95 స్థాయిని చేరింది. అయితే ఆఖర్లో కోలుకున్నది. ఈ క్రమంలోనే చివరకు 5 పైసలు లాభపడి 87.45 వద్ద ముగిసింది. శుక్రవారం 87.50 దగ్గర ఆగిన విషయం తెలిసిందే. కానీ అంతకుముందు రోజు గురువారం మునుపెన్నడూ లేనివిధంగా 87.59 స్థాయికి పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని చవిచూసింది.
ఈ నేపథ్యంలో తాజా లాభాలతో వరుసగా రెండు రోజుల ట్రేడింగ్‌ల్లో 14 పైసలు లాభపడినైట్టెంది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తమ దేశంలోకి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంలపై 25 శాతం సుంకాలు వేయడం డాలర్‌ను బలపర్చింది. అమెరికాపై పరస్పర సుంకాలతో బదులిస్తున్న దేశాలపై ప్రతీకార సుంకాలకూ ట్రంప్ దిగుతున్నారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందేమోనన్న భయాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఈ అంచనాలు కూడా రూపీని బలహీనపరుస్తున్నాయన్న అభిప్రాయాలు ఫారెక్స్ మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.