ముంబై, డిసెంబర్ 27: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సోమవారం స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు జోరు చూపించాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగి 57,420 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు ర్యాలీ జరిపి 17,086 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీతో పాటు ఫార్మా, ఫైనాన్షియల్ షేర్లకు కూడా కొనుగోలు మద్దతు లభించిందని ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా కొవిడ్-19 వొమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నప్పటికీ, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయన్న వార్తలు, వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా భారత్ జీడీపీ మంచి వృద్ధి సాధిస్తుందంటూ రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడు వ్యక్తంచేసిన అభిప్రాయాలతో మార్కెట్ ర్యాలీ జరిపిందని విశ్లేషకులు తెలిపారు.
టెక్ మహీంద్రా టాప్ గెయినర్
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టెక్ మహీంద్రా 3 శాతంపైగా పెరగ్గా, డాక్టర్ రెడ్డీస్ 1.95 శాతం, పవర్‌గ్రిడ్ 1.6 శాతం, కొటక్ బ్యాంక్ 1.5 శాతం, సన్‌ఫార్మా 1.1 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, మారుతి, భారతి ఎయిర్‌టెల్‌లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకెక్స్, ఫైనాన్స్, రియల్టీ, ఐటీ ఇండెక్స్‌లు 1.37 శాతం వరకూ పెరిగాయి. మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికం, ఎనర్జీ సూచీలు 0.36 శాతం మేర నష్టపోయాయి.