న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: అసెస్మెంట్ ఇయర్ 2025-26కిగాను ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారందరికి కృతజ్ఞతలు..వీరి వల్లనే కీలక మైలురాయి 6 కోట్లను అధిగమించినట్టు, అయినప్పటికీ ప్రస్తుతేడాదికి ఐటీ రిటర్నుల గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో మరింత మంది పెరిగే అవకాశం ఉన్నదని ఎక్స్‌లో పేర్కొంది.
చివరి గడువు ఈ నెల 15. ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హెల్ప్‌డెస్క్ 24 గంటలు పనిచేస్తున్నదని, ముఖ్యంగా కాల్స్, లైవ్ చాట్స్, ఎక్స్ ద్వారా సమాధానాలు ఇస్తున్నట్టు పేర్కొంది. 2024-25లో రికార్డు స్థాయిలో 7.28 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. 2023-24లో దాఖలు చేసిన 6.77 కోట్లతో పోలిస్తే 7.5 శాతం అధికం.