E-Chips | న్యూఢిల్లీ, జూన్ 23: వచ్చే ఏడాది చివరినాటికి దేశీయంగా తయారైన ఈ-చిప్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాదికాలంలో దేశీయంగా నాలుగు నుంచి ఐదు సెమికండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. రూ.22,540 కోట్ల పెట్టుబడితో కంప్యూటర్ స్టోరేజ్ చిప్ తయారీ సంస్థ మైక్రాన్..భారత్లో తన తొలి అసెంబ్లీ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యూనిట్లో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
గుజరాత్లో మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, ఫ్యాక్టరీ డిజైన్ వర్క్, పన్ను సంబంధిత ఒప్పందాలు పూర్తయ్యాయని వైష్ణవ్ తెలిపారు. 2.75 బిలియన్ డాలర్ల (రూ.22,540 కోట్లు) పెట్టుబడితో నెలకొంటున్న ఈ ప్లాంట్లో మైక్రాన్ 825 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుందని, మిగిలిన మొత్తాన్ని రెండు విడతలుగా ప్రభుత్వం ప్రోత్సాహకాల రూపంలో అందిస్తుందని వివరించారు. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగితే ఈ ప్రాజెక్టు టర్నోవర్ ఒక బిలియన్ డాలర్లు (రూ.8,200 కోట్లు) ఉంటుందన్నారు.