ఒకప్పుడు కేవలం నగలుగానే తెలిసిన బంగారం, వెండి.. ఇప్పుడు అంతకుమించి గొప్ప పెట్టుబడి సాధనాలుగా తయారయ్యాయి. భారత్‌లాంటి సంప్రదాయ దేశంలోనూ గోల్డ్, సిల్వర్.. ఇన్వెస్టర్లకు అత్యుత్తమ సురక్షిత పెట్టుబడి మార్గాలుగా అవతరించాయి మరి. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డు స్థాయిల్లో ఇవి పరుగులు పెడుతున్నాయి. నిజానికి గత ఏడాది 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,950 వద్ద ముగిసింది. అలాగే కిలో వెండి రేటు రూ.89,700 దగ్గర ఆగింది. అయితే ప్రస్తుతం గోల్డ్ రూ.1,32,900గా, సిల్వర్ రూ.1,83,500గా ఉన్నాయి. దీంతో గడిచిన ఈ ఏడాది కాలంలో బంగారం విలువ దాదాపు 70 శాతం పుంజుకోగా, వెండి రెట్టింపునకుపైగా ఎగబాకినైట్టెంది. ఈ ఏడాది అక్టోబర్‌లోనైతే తులం పసిడి మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,34,800 పలికింది. వెండి కూడా ఆల్‌టైమ్ హైని చేరి 1,85,000గా నమోదైంది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా అటు బంగారం, ఇటు వెండి ధరలు 50సార్లకుపైగా ఆల్‌టైమ్ హై రికార్డుల్ని సృష్టించడం గమనార్హం. మార్కెట్లో నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనం.
2026లో ఏంటి?
ఈ ఏడాది అదరగొట్టిన పసిడి, వెండి ధరలూ వచ్చే ఏడాదీ అదే స్థాయిలో పరుగులు పెట్టవచ్చన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. ధరలు ఇంతలా పరుగులు పెట్టడానికి భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులే కారణమంటున్న ఎక్స్పర్ట్స్.. ఇప్పుడున్న వాతావరణమే 2026లోనూ కనిపించేలా ఉందని చెప్తున్నారు. దీంతో మదుపరులు సహజంగానే బంగారం, వెండిపై పెట్టుబడులను పెంచే వీలుందని, కాబట్టి మున్ముందూ ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు కమోడిటీ మార్కెట్‌ను ఎక్కువగా ప్రభావితం చేయవచ్చని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ), మరికొన్ని బ్రోకరేజీలు వచ్చే ఏడాది 15-30 శాతం వరకు గోల్డ్ రేటు పెరుగవచ్చని ఇప్పుడే అంచనా వేసున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడి నిల్వలను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థల్ని కాపాడుకోవడానికి గోల్డ్‌నే ఓ రక్షణ కవచంగా చూస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లు కీలకం
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల కదలికలూ గోల్డ్, సిల్వర్ వాల్యూలను నిర్ణయిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇటీవలికాలంలో వెండిపైనా పెట్టుబడుల్ని పెంచుకుంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో కదలాడుతున్న విషయం తెలిసిందే. బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో ఎగబాకడానికి ఇది కూడా ఓ కారణమేనని మెజారిటీ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఇంకా తీవ్రంగానే ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, వాణిజ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు వంటివి.. ఈక్విటీల ర్యాలీకి స్పీడ్ బ్రేకర్లుగా భావిస్తున్నారంతా. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడిస్తే.. గోల్డ్, సిల్వర్ రన్ ఖాయమనే చెప్పవచ్చు.
గుర్తుంచుకోండి..
మార్కెట్లో బంగారం, వెండి ధరలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. పెరిగేందుకు అవకాశాలున్నా.. క్షీణతకూ ఆస్కారం ఉన్నది. అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటే, స్టాక్ మార్కెట్లు లాభాల బాట పడితే.. రేట్ల పతనానికి వీలున్నది. కాబట్టి కొద్ది మొత్తాల్లో పెట్టుబడులు శ్రేయస్కరం. లేదంటే పెద్ద ఎత్తున కొంటే ధరలు పతనమైతే నష్టాలపాలైపోవచ్చు. ఎంతైనా మార్కెట్ నిపుణుల సూచనలతో మీ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవడం లాభదాయకం. ఎందుకంటే 20 శాతానికి మించి గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవేనని చెప్పవచ్చు. ఈక్విటీలు, ఫిక్స్డ్ డిపాజిట్లపైనా దృష్టి సారించి పెట్టుబడుల్ని మరల్చితే ఒడిదుడుకులను అధిగమించవచ్చు.
కిలో వెండి రూ.2 లక్షలకు..
వచ్చే ఏడాది ఆరంభంలోనే కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరవచ్చని అంచనాలున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక్క వారంలోనే 100 టన్నుల వెండి అమ్ముడైపోయిం ది. సాధారణ వినియోగదారులు, మదుపరులు, పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి ఆదరణ అంతకంతకూ పెరుగుతున్నదని భారతీయ బులియన్, జ్యుయెల్లర్స్ అసోసియేషన్ తెలిపింది. మాములుగానైతే నెలలో 10-15 టన్నుల వెండికే గిరాకీ ఉంటుంది. కానీ వారంలోనే 100 టన్నులకు డిమాండ్ రావడం ఇప్పుడు మార్కెట్ నిపుణులనూ ఆశ్చర్యపరుస్తున్నది. దీంతో జనవరి-మార్చిలో వెండి కిలో ధర రూ.2 లక్షలకు వెళ్లవచ్చని, వచ్చే ఏడాది ఆఖర్లో రూ.2.40 లక్షలు పలుకవచ్చన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అలాగే గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ 75 డాలర్లు పలుకవచ్చని అంటున్నారు. గోల్డ్ సైతం ఔన్స్ 5వేల డాలర్లను దాటవచ్చన్న అంచనాలున్నాయి.