న్యూఢిల్లీ, అక్టోబర్ 3: మారుతి సుజుకీకి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. 2019-20 సంవత్సరానికి రూ.2,159 కోట్ల పన్ను చెల్లించాలంటూ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ జారీ చేసింది. ఆ సంవత్సరానికి కంపెనీ సమర్పించిన ఐటీ రిటర్న్‌లో పేర్కొన్న కొన్ని అంశాల్లో మార్పులు చేస్తూ ఈ ఆర్డర్ జారీ అయ్యింది. అయితే దీన్ని సవాల్ చేస్తామని, తమ ఆర్థిక, ఉత్పాదక కార్యకలాపాలపై ప్రభావం ఉండదని మారుతి స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. తమ అభ్యంతరాల్ని వివాదాల పరిష్కార కమిటీకి దాఖలు చేస్తామన్నది. ఈ వార్త నేపథ్యంలో మంగళవారం కంపెనీ షేరు 2.37 శాతం క్షీణించి రూ.10,327 వద్ద ముగిసింది.
ఉత్పత్తిలో మారుతి కోత
మారుతి సుజుకీ గత నెలలో ఉత్పత్తిని తగ్గించింది. సెప్టెంబర్‌లో 1,74,978 యూనిట్ల వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్తత్తైన 1,77,468 యూనిట్లతో పోలిస్తే ఒక్క శాతం తగ్గినట్టు పేర్కొంది. ఎంట్రిలెవల్ కార్లు ఆల్టో, ఎస్-ప్రెస్సో ఉత్పత్తి 70 శాతం తగ్గగా, బాలెనో, సెలేరియో, డిజైర్, వ్యాగన్ ఆర్, సియాజ్ల ఉత్పత్తి భారీగా పడిపోయాయి.