ముంబై, జూన్ 25: దేశీయ ఐటీ సంస్థలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ దెబ్బకు ఐటీ రంగ సంస్థల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో నిఫ్టీ సూచీ ఏకంగా 9 శాతం వరకు పతనం చెందింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడం, విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఏఐ టెక్నాలజీతో ఐటీ కంపెనీల రాబడి తగ్గిపోయే అవకాశం ఉండటంతోపాటు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ గైడెన్స్‌ను భారీగా తగ్గించడంతో ఈ రంగ షేర్లు కుదుపునకు లోనయ్యాయి.
ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ఈ పెట్టుబడుల్లో ఐటీ రంగ సంస్థల నుంచి భారీగా ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు వెల్లడి అయ్యాయి. ప్రధానంగా ఐటీ రంగ సూచీల్లో ఎల్టీఐ మైండ్‌ట్రీ ఇప్పటి వరకు 37.84 శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్ 36.24 శాతం, టీసీఎస్ 35.71 శాతం, విప్రో 33.62 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 31.59 శాతం, ఎల్అండ్టీ టెక్నాలజీ 25.42 శాతం, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 22.86 శాతం, ఎంఫసిస్ 19.56 శాతం, టెక్ మహీంద్రా 11.11 శాతం, కోఫోర్జ్ 10.88 శాతం చొప్పున పతనం చెందాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో మదుపర్లలో సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 109.25 పాయింట్లు అందుకొని 77,100.47 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 34.35 పాయింట్లు ఎగబాకి 24,056 వద్ద నిలిచింది.
సూచీల్లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు 4.82 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలువగా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ముగియగా..పవర్‌గ్రిడ్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. ప్రారంభంలో లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ వార్తలు మదుపర్లను ప్రాఫిట్ బుకింగ్‌కు వైపు నడిపించాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మోహరం సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకు పరిమితమైంది. స్టాక్ మార్కెట్లతోపాటు మనీ, కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. తిరిగి సోమవారం యథావిధిగా సూచీలు పనిచేయనున్నాయి.