దేశంలో ప్రస్తుతమున్న ఆదాయం పన్ను (ఐటీ)పై దాదాపు రెండింటా మూడొంతుల మంది ఏమాత్రం సంతోషంగా లేరని ఇటీవలి ఓ సర్వేలో తేలింది. యూగవ్ అనే సంస్థ బడ్జెట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదాయ పన్నుపై ప్రజల మనోగతం అంచనా వేయడానికి సర్వేను నిర్వహించింది. దేశాభివృద్ధి కోసం ఆదాయం పన్ను మంచిదే అన్న అభిప్రాయాన్ని 74 శాతం పట్టణవాసులు వ్యక్తం చేశారు. అలాగే 38 శాతం నగరవాసులు రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపును ఇవ్వాలని కోరతున్నారు. 31 శాతం మంది ప్రస్తుతమున్న రూ.1.5 లక్షల ఐటీ మినహాయింపును పెంచాలని కోరుతున్నారు. అలాగే వేతన జీవులకు పన్ను ఊరట కల్పించాలని 32 శాతం మంది కోరుతున్నారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి పెంచాలని కూడా వారి వినతి.
కరోనా ట్రీట్మెంట్కు అయ్యే వ్యయాలకు ప్రత్యేకంగా పన్ను మినహాయింపులను ఇవ్వాలని మరో 35 శాతం మంది కోరిక. అలాగే 80డి కింద ప్రస్తుతమున్న మెడికల్ వ్యయాల పరిమితిని కూడా పెంచాలని 30 శాతం మంది కోరుతున్నారు. హౌజింగ్ లోన్ వడ్డీ మీద మరింత రాయితీ కల్పించాలని ఉద్యోగులు అంటున్నారు. వ్యవసాయ ఆదాయంపై పన్నును విధించరాదని 60 శాతం మంది సూచిస్తున్నారు. దాదాపు 51 శాతం మంది వ్యాపారస్తులు తాము మిగతా వారికన్నా అధికంగా పన్ను చెల్లిస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో 1,022 మంది అభిప్రాయాలను యూగవ్ సేకరించింది. దాదాపు 47 శాతం మంది ఏటా తాము బడ్జెట్‌ను ఫాలో అవుతామని 27 శాతం అప్పుడప్పుడు గమనిస్తామని చెప్పారు. ఇక 67 శాతం మంది బడ్జెట్ తమ పర్సనల్ ఫైనాన్స్‌పై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. వీరిలో అధికంగా మధ్యతరగతి వారే ఉన్నారు.