న్యూఢిల్లీ, జూన్ 12: అన్ని జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్లలో పాలసీ లోన్ సదుపాయం అనేది ఇకపై తప్పనిసరి అని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ బుధవారం ఇన్సూరెన్స్ కంపెనీలకు స్పష్టం చేసింది. జీవిత బీమా తీసుకున్న పాలసీదారులకు నిబంధనలకు లోబడి వారి పిల్లల ఉన్నత చదువులు, పెండ్లిళ్లు, గృహ నిర్మాణం లేదా కొనుగోలు, వైద్య చికిత్స తదితర నగదు అవసరాలనుబట్టి రుణాలు ఇవ్వాల్సిందేనని సదరు సంస్థలకు చెప్తూ ఓ మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది.
జీవిత బీమా పాలసీలకు సంబంధించి ఉన్న అన్ని రెగ్యులేషన్లను ఏకం చేస్తూ దీన్నిచ్చింది. ఇక పాలసీదారులు తమ పాలసీ నిబంధనలు, షరతులను సమీక్షించేందుకున్న సమయాన్ని (ఫ్రీ లుక్ పీరియడ్) 15 రోజుల నుంచి 30 రోజులకు ఐఆర్డీఏఐ పెంచింది. ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం కూడా ఐఆర్డీఏఐ ఇదే తరహా మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసిన సంగతి విదితమే. కాగా, పాలసీలను సరెండర్ చేస్తే పాలసీదారులకు ప్రయోజనకరంగా బీమా సంస్థల నిర్ణయాలుండాలని ఐఆర్డీఏఐ తెలిపింది.