Crude Oil | న్యూఢిల్లీ, అక్టోబర్ 2: క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఒక్కసారిగా పుంజుకున్నది. బ్యారెల్ క్రూడాయిల్ ధర బుధవారం ఒక దశలో ఏకంగా 5 శాతం వరకు పెరిగి 75 డాలర్ల పైకి చేరుకున్నది. చివరకు 73.90 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఇరాన్ నుంచి క్రూడాయిల్ ఎగుమతులు భారీగా పడిపోయాయని ఆర్బీసీ క్యాపిటల్ వర్గాలు వెల్లడించాయి.
ఆహార ద్రవ్యోల్బణాన్ని తీసిపారేయద్దు: రాజన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 2: వడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవద్దంటూ వస్తున్న సూచనల నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దీనిపై స్పందించారు. ప్రధాన ద్రవ్యోల్బణం నుంచి ఆహార ధరల సూచీని విడదీయడానికి తాను వ్యతిరేకమన్నారు. ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగానే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ సవరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడవద్దని, దాన్నిబట్టి వడ్డీరేట్లను నిర్ణయించవద్దన్న సూచనలు వస్తున్నాయి. కానీ ఇది సరికాదన్న అభిప్రాయాన్ని రాజన్ తాజాగా పీటీఐతో వెలిబుచ్చారు.