Stock Market | న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఆయా సంస్థలు.. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో తమ షేర్లను నమోదు చేశాయి. దీంతో వీటికి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. నిజానికి అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీలు భారీగా నష్టపోయినా.. ఈ కంపెనీల షేర్లు మాత్రం ఆకర్షణీయ లాభాలను అందుకోవడం గమనార్హం. కాగా, హైదరాబాద్ ఆధారిత సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, గురుగ్రామ్‌కు చెందిన మొబీక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్, విశాల్ మెగా మార్ట్ లిమిటెడ్ కంపెనీలు స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అయ్యాయి. తొలిరోజున సాయి లైఫ్ 39 శాతానికిపైగా, మొబీక్విక్ 90 శాతం వరకు, విశాల్ మెగా మార్ట్ 43 శాతానికిపైగా లాభపడ్డాయి. సాయి లైఫ్ షేర్లు బీఎస్ఈలో 43.54 లక్షలు, ఎన్ఎస్ఈలో 466.59 లక్షల మేర చేతులు మారాయి. అలాగే మొబీక్విక్ షేర్లు బీఎస్ఈలో 26.03 లక్షలు, ఎన్ఎస్ఈలో 295.75 లక్షల మేర ఎక్సేంజ్ అయ్యాయి. ఇక విశాల్ మెగా మార్ట్ షేర్లు బీఎస్ఈలో 795.19 లక్షలు, ఎన్ఎస్ఈలో 7,287.32 లక్షల మేరకు ట్రేడ్ అవడం జరిగింది. ఉదయం స్టాక్ మార్కెట్లు మొదలైన దగ్గర్నుంచే ఈ మూడు కంపెనీల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. స్టాక్ మార్కెట్లో ఓవరాల్ ట్రెండ్‌తో సంబంధం లేకుండా చివరిదాకా ఆ జోష్ పెరుగుతూపోవడంతో ఈ సంస్థలకు లిస్టింగ్ డే గుర్తుండిపోయేలా నిలిచింది. రూ.3,043 కోట్లతో ఔషధ రంగానికి చెందిన సాయి లైఫ్ ఐపీవో, రూ.572 కోట్లతో డిజిటల్ పేమెంట్స్ రంగానికి చెందిన మొబీక్విక్ ఐపీవో, రూ.8,000 కోట్లతో రిటైల్ రంగానికి చెందిన విశాల్ మెగా మార్ట్ ఐపీవోలు వచ్చాయి. ఇదిలావుంటే గురువారం మరో 5 సంస్థలు స్టాక్ మార్కెట్లలో నమోదు కానున్నాయి. డీఏఎం క్యాపిటల్, ట్రాన్స్‌రైల్ లైటింగ్, సనాథన్ టెక్స్టైల్స్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్, మమతా మెషినరీ కంపెనీలు రాబోతున్నాయి. దీంతో ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగైన కంపెనీల సంఖ్య 9కి చేరనున్నది. ఈ నెల 6న సురక్ష డయాగ్నోస్టిక్ ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. దీని ఐపీవో పరిమాణం రూ.846.25 కోట్లు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 502.25 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 80,182.20 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 634.38 పాయింట్లు పతనమైంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 137.15 పాయింట్లు లేదా 0.56 శాతం దిగజారి 24,198.85 వద్ద నిలిచింది. సోమ, మంగళవారాల్లోనూ సూచీలు నిరాశపర్చిన విషయం తెలిసిందే. ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచబోతున్నదన్న అంచనాల మధ్య మదుపరులు కొనుగోళ్లకు దూరమయ్యారు. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి అదేపనిగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం, డాలర్‌తో పోల్చితే అంతకంతకూ బలహీనపడుతున్న రూపాయి కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. కాగా, సెన్సెక్స్‌లో టాటా మోటర్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 0.76 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.61 శాతం పడిపోయాయి. రంగాలవారీగా యుటిలిటీస్, పవర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 2.06 శాతం నుంచి 1.20 శాతం వరకు నష్టపోయాయి.
అంబుజా సిమెంట్స్‌లో సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా సిమెంట్స్‌ను విలీనం చేస్తామన్న అదానీ గ్రూప్ ప్రకటన సంఘీ ఇండస్ట్రీస్ మదుపరులకు ఎంతమాత్రం రుచించలేదు. ఈ క్రమంలోనే బుధవారం ట్రేడింగ్‌లో సంఘీ ఇండస్ట్రీస్ షేర్ విలువ 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. బీఎస్ఈలో 11.91 శాతం కోల్పోయి రూ.67.76 వద్ద, ఎన్ఎస్ఈలో 11.83 శాతం క్షీణించి రూ.67.80 వద్ద స్థిరపడ్డాయి. గత ఏడాది డిసెంబర్లో సంఘీ ఇండస్ట్రీస్‌ను, ఈ ఏడాది ఆగస్టులో పెన్నా సిమెంట్స్‌ను అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్స్ హస్తగతం చేసుకున్నది విదితమే.