IPOs | పలు కంపెనీలు సొంత పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. తమ కార్యకలాపాలను విస్తరించడానికి నిధుల సేకరణ కోసం ఇన్షియల్ పబ్లిక్ (ఐపీఓ) ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అవుతుంటాయి. 2024లో ఐపీఓలకు వెళ్లిన కంపెనీలు దాదాపు 11.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించాయి. అదే ఊపులో ఇన్విట్ ప్లాన్‌తోపాటు ఏడు కంపెనీలు రూ.2,400 కోట్ల నిధుల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.
ఇంజినీరింగ్, మెడికల్, కెమికల్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ సంస్థ ఐపీఓ.., ఈ నెల ఆరో తేదీన ప్రారంభం కానున్నది. ఈ నెల మూడో తేదీన యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.123.04కోట్ల నిధులు సేకరించింది. ఈ సంస్థ ఐపీఓ ఈ నెల ఎనిమిదో తేదీన ముగుస్తుంది. ఈ షేర్ విలువ రూ. 133-140 గా ఖరారు చేశారు. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.200.05 కోట్ల విలువ గల 1.42 కోట్ల షేర్లు విక్రయిస్తుంది. రూ.210 కోట్ల విలువ గల కొత్త షేర్లను జారీ చేసింది.
భారతీయ రైల్వేల కవచ్ ప్రాజెక్టు కింద న్యూ జనరేషన్ ట్రైన్ కంట్రోల్, సిగ్నలింగ్ సిస్టమ్స్ అభివృద్ధి చేస్తుందీ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్. ఈ నెల 7-9 తేదీల మధ్య ఐపీఓకు వెళుతున్న క్వాడ్రాంట్ ఫ్యూచర్ టెక్ రూ.290 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొత్తం కొత్త షేర్ల జారీ ద్వారానే నిధులు సేకరిస్తుంది. ఐపీఓ షేర్ బాండ్ ధర రూ.275-290గా ఖరారు చేశారు.
గవార్ కన్స్ట్రక్ఛన్ స్పాన్సర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ ఈ నెల ఏడో తేదీన ఐపీఓకు వెళుతుంది. ఐపీఓ ద్వారా రూ.1,578 కోట్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేర్ ప్రైస్ బాండ్ రూ.99-100గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.1,077 కోట్ల విలువైన వాటాలు జారీ చేస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.501 కోట్ల నిధులు సేకరించాలని నిర్ణయించింది. ఈ సంస్థ ఐపీఓ జనవరి తొమ్మిదో తేదీతో ముగుస్తుంది.
ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి ఐపీఓకు వెళుతున్న తొలి సంస్థ ఇండోబెల్ ఇన్సులేషన్. ఈ నెల ఆరో తేదీన ఐపీఓ ప్రారంభం అవుతుంది. రూ.10.14 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా ఐపీఓకు వెళుతున్నదీ సంస్థ. ఈ ఐపీఓలో సంస్థ షేర్ విలువ రూ.46గా నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీన ముగుస్తుంది.
ఈ నెల ఏడో తేదీ నుంచి బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఐపీఓకు వెళుతుంది. ఈ సంస్థ ఐపీఓ షేర్ ధర రూ.128-135గా ప్రకటించారు. తాజా షేర్ల జారీ ద్వారా రూ.85.21 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ నెల తొమ్మిదో తేదీన ఐపీఓ బిడ్డింగ్ ముగుస్తుంది.
ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్ తయారీ సంస్థ డెల్టా ఆటో కార్పొరేషన్ ఐపీఓ ఈ నెల ఏడో తేదీన ప్రారంభం అవుతుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.54.6 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఐపీఓ షేర్ విలువ రూ. 123-130గా నిర్ణయించారు. ఈ నెల తొమ్మిదో తేదీన ఐపీఓ ముగుస్తుంది. తాజా 50.54 కోట్ల విలువ గల 38.88 లక్షల షేర్లను జారీ చేస్తారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.4.06 కోట్ల విలువ గల 3.12 లక్షల షేర్లు విక్రయిస్తారు.
వచ్చేవారం ప్రారంభమయ్యే ఐపీఓల్లో అతి చిన్నదీ అవాక్స్ అపారెల్స్ అండ్ ఆర్నమెంట్స్. సిల్వర్ ఆర్నమెంట్స్, నిట్టెడ్ ఫ్యాబ్రిక్ హోల్ సేలర్ అవాక్స్. ఐపీఓ ద్వారా రూ.1.92 కోట్ల నిధులు సేకరించాలని అవాక్స్ అపారెల్స్ అండ్ ఆర్నమెంట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. షేర్ విలువ రూ.70గా నిర్ణయించారు. ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ ఐపీఓ కొనసాగుతుంది.
జనవరి ఆరో తేదీన పరమేశ్వర్ మెటల్, డావిన్ సన్స్ రిటైల్ ఐపీఓలు ముగుస్తాయి. పరమేశ్వర్ మెటల్ 41.96 రెట్లు, డావిన్ సన్స్ రిటైల్ 11.95 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఫ్యాబ్ టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్ ఐపీఓ కూడా ఈ నెల ఏడో తేదీ ముగుస్తుంది. తొలి రోజు ఫ్యాబ్ టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్ ఐపీఓలో సంస్థ షేర్ 18.46 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
ఈ నెల ఏడో తేదీన ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ సంస్థ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టవుతుంది. ఈ సంస్థ ఐపీఓలో ఆశించిన దాని కంటే 229.68 రెట్లు సబ్స్క్రిప్షన్లు దాఖలయ్యాయి. ట్రాక్టర్లు, పిక్ అండ్ క్యారీ క్రేన్ల తయారీ సంస్థ గ్రే మార్కెట్లో 45 శాతం ప్రీమియం ఆకర్షించిందని పరిశీలకులు చెబుతున్నారు. ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఐపీఓలకు వెళ్లిన ఐదు సంస్థలు వచ్చే వారం స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అవుతాయి. ఈ నెల ఏడో తేదీన టెక్నికెమ్ ఆర్గానిక్, ఎనిమిదో తేదీన లియో డ్రై ప్రూట్స్ అండ్ స్పైస్, తొమ్మిదో తేదీన పరమేశ్వర్ మెటల్ అండ్ డావిన్ సన్స్ రిటైల్, పదో తేదీన ఫ్యాబ్ టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్ లిస్టవుతాయి.