Investors Wealth | శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ లాభాలతో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.46 లక్షల కోట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 819.69 పాయింట్లు వృద్ధితో 79,705.91 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్ లో సెక్సెక్స్ 1098.02 పాయింట్ల లబ్ధితో 79,984.24 పాయింట్ల గరిష్టానికి చేరుకున్నది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,46,308.99 కోట్లు వృద్ధి చెంది రూ.4,50,21,816.11 కోట్ల (5.37 లక్షల డాలర్లు) కు పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్ల దన్నుతో దేశీయ ఇండెక్సులు దూసుకెళ్లాయని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సె చెప్పారు. అంతర్గత ట్రేడింగ్లో ఇన్వెస్టర్ల నుంచి ఆల్ రౌండ్ మద్దతు లభించిందన్నారు.
శుక్రవారం ట్రేడింగ్లో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతీయ స్టేట్ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు కొటక్ మహీంద్రా బ్యాంక్, సన్ పార్మా నష్టాలను చవి చూశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.21 శాతం, స్మాల్ క్యాప్ 0.79 శాతం లాభాలతో ముగిశాయి. ఐటీ 1.59 శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ 1.57, రియాల్టీ 1.56, ఆటో 1.51, టెక్ 1.41, క్యాపిటల్ గూడ్స్ 1.37 శాతం లాభాలతో అన్ని ఇండెక్సులు పాజిటివ్ గా ముగిశాయి. బీఎస్ఈలో 2330 స్టాక్స్ లాభాలతో స్థిర పడితే, 1579 స్టాక్స్ నష్ట పోయాయి. మరో 97 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.