Investors Wealth | సరిహద్దు నిఘా పెంచుతామని మెక్సికో, కెనడా హామీ ఇవ్వడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాలపై విధించిన సుంకాలను నెల రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు దాదాపు రెండు శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్1,397.07 (1.81 శాతం) పాయింట్లు పుంజుకుని 78,583.81 పాయింట్లతో నెల రోజుల గరిష్టాన్ని తాకింది. ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ 1,471.85 (1.90 శాతం) పుంజుకుని 78,658.59 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లింది. మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 378.20 (1.62 శాతం) వృద్దితో 23,739.25 పాయింట్ల వద్ద నిలిచింది. జనవరి మూడో తేదీ తర్వాత ఈ స్థాయికి చేరుకోవడం తొలిసారి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో శరవేగంగా పుంజుకోవడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావిస్తున్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,95,996.51 కోట్లు పెరిగి రూ.4,25,50,826.11 కోట్ల (4.88 లక్షల కోట్ల అమెరికా డాలర్లు) వద్ద ముగిసింది.
మెక్సికో, కెనడాలపై విధించిన సుంకాలు నెల రోజులు వాయిదా వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే దేశీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు ట్రేడ్ వార్ నుంచి భారీ రిలీఫ్ లభించిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు. బీఎస్ఈ-30లో బ్లూ చిప్ కంపెనీలు లార్సెన్ అండ్ టర్బో దాదాపు 5 శాతం వృద్ధి చెందింది. అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్ ప్రధానంగా లాభ పడ్డాయి. మరోవైపు , ఐటీసీ హోటల్స్, జొమాటో, నెస్లే ఇండియా, మారుతి సుజుకి నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ గణనీయ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.35 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.20 శాతం వృద్ధి చెందాయి.
సెక్టార్ల వారీగా క్యాపిటల్ గూడ్స్ 3.42 శాతం, ఇండస్ట్రీయల్స్ 2.59 శాతం, ఇంధనం 2.50 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.40 శాతం, పవర్ 2.31 శాతం, ఫైనాన్సియల్ సర్వీసెస్ రెండు శాతం వృద్ధి చెందాయి. కేవలం బీఎస్ఈ ఎఫ్ఎంసీజీ మాత్రమే నష్టాలతో ముగిసింది. బీఎస్ఈ-30లో 2,509 స్టాక్స్ లాభాలు గడించగా, 1,410 స్టాక్స్ పతనం అయ్యాయి. మరో 154 స్టాక్స్ ఫ్లాట్గా ముగిశాయి.