Investors Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం ఒక్కరోజే రూ.4.92 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మంగళవారం వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. మంగళవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30 1,064.12 పాయింట్ల పతనంతో 80,684.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 1,136.37 పాయింట్ల వరకూ నష్టపోయి 80,612.20 పాయింట్ల కనిష్టానికి పతనమైంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,92,644 కోట్ల నష్టంతో రూ.4,55,13,913.24 కోట్లకు పడిపోయింది.
బుధవారం యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం వెలువడనుండటంతో ఇండెక్సులు పతనం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బీఎస్ఈ-30లోని బ్లూ చిప్ కంపెనీలన్నీ నష్టాలతో ముగిశాయి. భారతీ ఎయిర్ టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఏషియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టర్బో, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో అత్యధికం పతనంతో స్థిర పడ్డాయి. వాల్ స్ట్రీట్ మార్కెట్ సోమవారం లాభాలతో ముగిసింది. ఇదిలా ఉంటే, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వె్స్టర్లు సోమవారం రూ.278.70 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు.