Investers Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భారీగా విక్రయానికి దిగడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.7.52లక్షల కోట్లు హరించుకుపోయింది. మంగళవారం బీఎస్ఈ ఇండెక్స్ సెనెక్స్ 1,235 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,52,520.34 కోట్లు పతనమై రూ.4,24,07,205.81 కోట్ల (4.90 లక్షల కోట్ల అమెరికా డాలర్లు)కు చేరుకుంది. బీఎస్ఈలోని 4,088 షేర్లలో 2,881 స్టాక్స్ పతనం అయ్యాయి. కేవలం 1,106 షేర్లు లాభ పడితే, 101 స్టాక్స్ యధాతథంగా ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెనెక్స్ 1,235.08 పాయింట్లు (1.60 శాతం) నష్టంతో 75,838.36 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ 1,431.57 పాయింట్లు నష్టపోయి 75,641.87 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోగా, తిరిగి 77,337.36 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది.
“దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడింగ్ సాగినా నష్టాలతోనే ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాలపై అనిశ్చితితో విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకానికి దిగారు. దీనికి తోడు దేశీయ కార్పొరేట్ సంస్థల తృతీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు నిరాశ పరిచాయని స్టోక్బాక్స్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ అమేయ రణదివే చెప్పారు. తృతీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉంటడంతో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జోమాటో షేర్లు 10.92 శాతం పతనం అయ్యాయి.
బీఎస్ఈలో ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ తదితర స్టాక్స్ భారీగా నష్టపోయాయి. కేవలం ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు మాత్రమే లాభ పడ్డాయి. బ్రాడర్ మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ రెండుశాతం, స్మాల్ క్యాప్ 1.94 శాతం నష్టపోయాయి. బీఎస్ఈలో రియాల్టీ 4.22 శాతం నష్టపోగా, తర్వాతీ స్థానాల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ 3.99 శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ 2.90 శాతం, సర్వీసెస్ 2.86 శాతం, పవర్ 2.63 శాతం, టెలికమ్యూనికేషన్స్ 2.52 శాతం, యుటిలిటీస్ 2.35 శాతం నష్టపోయాయి. బీఎస్ఈలోని 13 సెక్టార్లు నష్టాలతోనే ముగిశాయి. రియాల్టీ, కన్జూమర్ డ్యూరబుల్ సెక్టార్లు అధిక ఒత్తిడికి గురయ్యాయి. ఇదిలా ఉంటే మంగళవారం కల్లా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.5,920 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించారు.