Stock Markets | ముంబై, డిసెంబర్ 20: స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వచ్చే ఏడాది రేట్లను ఆశించిన స్థాయిలో కోతలు ఉండకపోవచ్చన్న అమెరికా ఫెడరల్ రిజర్వు సంకేతాలు ఇవ్వడం మదుపరుల్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో వరుసగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల భారీగా తమ పెట్టుబడులను తరలించుకుపోతుండటంతో వరుసగా ఐదోరోజూ శుక్రవారం సూచీలు నష్టాలు ఏరులైపారాయి.
ఇంట్రాడేలో 1,300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,176. 46 పాయింట్లు లేదా 1.49 శాతం పతనం చెంది 79 వేల పాయింట్ల దిగువకు 78,041. 59 వద్ద ముగిసింది. మరోసూచీ నిఫ్టీ కూడా 364.20 పాయింట్లు లేదా 1.52 శాతం కోల్పోయి 23,587.50 వద్ద ముగిసింది.
దీంతో వరుసగా ఐదు రోజుల్లో మదుపరులు రూ.18 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.18,43,121. 27 కోట్లు కరిగిపోయి రూ.4,40,99,217. 32 కోట్లకు(5.18 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 4,091.53 పాయింట్లు లేదా 4.98 శాతం, నిఫ్టీ 1,180.8 పాయింట్లు లేదా 4.76 శాతం కోల్పోయింది.