న్యూఢిల్లీ, నవంబర్ 10: గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) మదుపరులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. గత నెల అక్టోబర్‌లో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల సెప్టెంబర్‌లో వచ్చినవి కేవలం రూ.175.3 కోట్ల పెట్టుబడులే కావడం గమనార్హం. దీంతో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లను తమ పెట్టుబడులకు సురక్షిత సాధనాలుగా భావిస్తున్నారంటూ తాజా సరళిని ట్రేడింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చిత వాతావరణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు భయాలు, అంచనాలకు మించి నమోదవుతున్న ద్రవ్యోల్బణం, దేశ జీడీపీ వృద్ధిరేటు మందగమనం వంటి పరిణామాల మధ్య మెజారిటీ మదుపరులు బంగారాన్ని తమ పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావిస్తున్నారు’ అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా రిసెర్చ్ మేనేజర్, విశ్లేషకుడు మెల్విన్ శాంటారిటా అన్నారు.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) గణాంకాల ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలో అక్టోబర్ 31 నాటికి రూ.26,163 కోట్లున్నట్టు తేలింది. సెప్టెంబర్ ఆఖరుకల్లా ఉన్నవి రూ.23,800 కోట్లే. దీంతో నెల రోజుల్లో దాదాపు 10 శాతం పెరిగినైట్టెంది. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మదుపరుల ఖాతాలు కూడా సుమారు 27,700 పెరిగి అక్టోబర్ 31 నాటికి 48.34 లక్షలకు చేరాయి. సెప్టెంబర్ 30కి 48.06 లక్షలుగానే ఉన్నాయి. కాగా, గ్రాము బంగారానికి ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ సమానం.