Stock Market | అక్టోబర్ మొదటి పక్షం రోజుల్లో బ్యాంకుల నుంచి రూ.1.12లక్షల కోట్లు విత్డ్రా అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇంతకు ముందు ఈ సొత్తంతా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిగా ఉండేది. అక్టోబర్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు ఆరు శాతం పడిపోయింది. దాంతో పెట్టుబడిదారులకు భారీ నష్టాన్ని కలిగించింది. మార్కెట్ల వరుస పతనంతో మదుపరులంతా అప్రత్తమై పెట్టుబడులను ఉపసంహరించుకొని ఆ సొమ్మును బ్యాంకులకు తరలిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 85,800 పాయింట్లకు చేరుకొని గరిష్ఠాన్ని తాకింది. ఆ సమయంలో మార్కెట్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఆ సమయంలో లిస్టెడ్ కంపెనీల మూలధనం రూ.478లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ రికార్డు కంటే ముందు ఆగస్టు చివరిపక్షం రోజుల్లో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు రూ.215.50లక్షల కోట్లుగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి.
గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ తొలి పక్షంరోజుల్లో డిపాజిట్లు రూ.45వేల కోట్లు తగ్గి రూ.215.05 లక్షల కోట్లకు చేరాయి. కానీ, కానీ సెప్టెంబర్ చివరిలో మార్కెట్ల పతనం ప్రారంభమయ్యాక.. డిపాజిట్లు మరింత పెరిగాయి. అక్టోబర్ 4న రూ.219లక్షలకోట్లుకు చేరగా.. అక్టోబర్ 18 నాటికి రూ.218లక్షల కోట్ల ఉండగా.. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు బ్యాంకుల మొత్తం రుణాలు రూ.4లక్షల కోట్లకు పెరిగితే.. డిపాజిట్లు రూ.5లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబరు వరకు బ్యాంకుల డిపాజిట్లు 7.7శాతం పెరిగి దాదాపు రూ.220 లక్షల కోట్లకు చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్లలో మొత్తం పెట్టుబడి విలువ 25.9 శాతం పెరిగింది. అక్టోబర్ నుంచి స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.47 లక్షల కోట్లు నష్టపోయారు. సెప్టెంబర్ 27న మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 477.90 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు అది రూ.430.60 లక్షల కోట్లకు తగ్గింది.