Investers Wealth | దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల భారీన పడటంతో రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.13 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. మంగళ, బుధవారాల్లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ రెండు శాతానికి పైగా నష్టపోయింది. అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిస్ట స్థాయి 6.21 శాతంగా నమోదు కావడంతోపాటు కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాల్లో నామమాత్రపు లాభాలు, విదేశీ ఇన్వెస్టర్ల వాటాల విక్రయంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీన పడింది. ఇన్వెస్టర్లు భారీగా సర్దుబాట్లకు దిగారు.
ఫలితంగా మంగళ, బుధవారాల్లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,805.2 పాయింట్లు (2.27 శాతం) నష్ట పోయింది. బుధవారం ఒక్కరోజే సెన్సెక్స్ 984.23 పాయింట్ల నష్టంతో 77,690.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా మదుపర్ల సంపదగా భావిస్తున్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,07,898.47 కోట్లు కోల్పోయి, రూ.4,29,46,189.52 కోట్లకు చేరుకున్నది. ఇక ఆహార వస్తువుల ధరలు పెరిగిపోవడంతో అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతంగా నమోదు కావడం ఆర్బీఐ కంఫర్ట్ లెవల్ కంటే ఎక్కువే. దీంతో మున్ముందు వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి.
ఇక బుధవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోయాయి. మరోవైపు ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ స్టాక్స్ లాభాలతో ముగిశాయి. మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,024.31 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్ల విలువ బలోపేతం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీన పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.