ముంబై, డిసెంబర్ 6: గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం వెనుకంజ వేయడం లేదు. ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ లక్ష కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమించిందని జెరోధా ఫండ్ హౌజ్ తన నివేదికలో వెల్లడించింది. గోల్డ్ ఈటీఎఫ్‌లు పారదర్శకంగా ఉండటం, పన్ను సమర్థవంతమైన పెట్టుబడులుగా ఉండటంతో ఎగబడి ఇన్వెస్ట్ చేస్తున్నారని పేర్కొంది.
ఈ కీలక మైలురాయికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అక్టోబర్ 2004 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు గోల్డ్ ఈటీఎఫ్‌ల ఏయూఎం రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది. ఒక 2025లోనే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.27,500 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. గడిచిన ఐదేండ్లలో వచ్చి పెట్టుబడులు ఒక 2025లో ఇన్వెస్ట్ చేయడం విశేషం. రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టడం, ధరలు ఆకాశాన్ని అంటుతుండటం, ఈటీఎఫ్‌లపై నమ్మకం పెరగడంతో వంటి కారణాలతో పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతున్నదని పేర్కొంది. ధరలు పెరగడంతోపాటు డిజిటల్ ఇన్వెస్ట్మెంట్లపై నమ్మకం పెరుగుతుండటం ఇందుకు కారణమని విశ్లేషించింది.
భౌతిక బంగారంతో పోలిస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లపై దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను 12.5 శాతంగా వసూ లు చేస్తుండటంతో కూడా పెట్టుబడులు పుంజుకోవడానికి ప్రధాన కారణమని తెలిపింది. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టేవారు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. అక్టోబర్ 2020లో 7.83 లక్షల మంది ఇన్వెస్ట్ చేయగా..అదే ఈ ఏడాది అక్టోబర్ నాటికి 95 లక్షలకు చేరుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు 83 టన్నుల గోల్డ్‌ను కలిగివున్నాయి. పసిడి ఈటీఎఫ్లతోపాటు వెండి ఈటీఎఫ్‌లకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్నది.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి శనివారం కాస్త శాంతించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.540 తగ్గి రూ.1,30,150కి పడిపోయింది. అంతకుముందు ఇది రూ.1,30, 690గా ఉన్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.500 తగ్గి రూ.1,19,300గా నమోదైంది. అలాగే కిలో వెండి రూ.1,95,900 వద్ద స్థిరంగా ఉన్నది.