Mutual Funds | మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నది. దీనికి నిదర్శనంగా రికార్డు స్థాయిలో పెరిగిన పెట్టుబడులను చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో అసెట్ అండర్ మేనేజిమెంట్ (ఏయూఎం) దాదాపు రూ.40 లక్షల కోట్ల మార్క్ దాటింది. గత 4 ఏండ్లలో ఏయూఎం రూ. 24 లక్షల కోట్ల నుంచి రూ.40.37 లక్షల కోట్లకు చేరుకున్నది. గత అక్టోబర్ నెలతో పోలిస్తే గత నెలలో ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు 76 శాతం తగ్గాయి. దీనికి ప్రాఫిట్ బుకింగ్ కారణమని మార్కెట్ పరిశీలకులు చెప్తున్నారు.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) ప్రకారం, నవంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏయూఎం రూ. 40.37 లక్షల కోట్లుగా ఉంది. అక్టోబర్‌లో ఇది రూ.39.50 లక్షల కోట్లు. ఇదే కాలంలో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి దాదాపు 76 శాతం క్షీణించి రూ.2,258 కోట్లకు చేరుకున్నది. అక్టోబర్‌లో ఇన్వెస్టర్లు రూ.9,390 కోట్లను ఈ ఫండ్స్‌లో పెట్టారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) వంటి క్లోజ్-ఎండ్ ఫండ్లు చాలా నిరాడంబరమైన పెట్టుబడులను కలిగి ఉంటాయి.
శుక్రవారం నాటి డాటా ప్రకారం, సిప్ ద్వారా పెట్టుబడి గత నెలలో రూ. 13,307 కోట్ల కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నది. అక్టోబర్ నెలలో తొలిసారిగా సిప్ పెట్టుబడులు రూ.13,000 కోట్లు దాటాయి. ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి తగ్గింది. కానీ ఉపసంహరణ లేకపోవడం మంచి పరిణామం. 2021 మార్చి నుంచి 21వ నెలలో నికర పెట్టుబడులు కనిపించాయి. కొంతమంది ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్‌కి మారడంతో గత నెలలో ఇది దిగువకు పడిపోయింది.